శకపురుషుని శతజయంతి.. జయహో ఎన్టీఆర్!

సామాన్యుడిగా మొదలై, అసామాన్యునిగా ఎదిగి నిలిచిన శకపురుషుడు నందమూరి తారక రామారావు. జగదేక సుందర రూపం, నవ నవోన్మేష చైతన్య స్వరూపం తారకరామనామధేయం. ఇటు సినీ జగత్తులోనూ, అటు రాజకీయ రణరంగంలోనూ రాణకెక్కిన ప్రతిభా భాస్వంతం. వెండితెరపై ఎన్నో పాత్రలు పోషించి అన్నింటా అగ్రగామిగా నిలిచి, నిజజీవిత నాటకరంగంలోనూ కొడుకుగా, భర్తగా, తండ్రిగా, తాతగా, నాయకుడిగా, మహానాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా.. ఇన్ని పాత్రలు గొప్పగా పోషించి అనితరసాధ్యుడు అనిపించుకున్న మహామనీషి ఎన్టీఆర్.

ఇది.. తెలుగువారి కీర్తి పతాకను దేశవ్యాప్తంగా రెపరెపలాడించిన తెలుగు ఆత్మగౌరవ చిహ్నం ఎన్టీఆర్ శతజయంతి సందర్భం. ఆకర్షణకూ, సమ్మోహనత్వానికీ మరోపేరుగా భాసించిన తారకరాముడు కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1923 మే 28న లక్ష్మయ్య, వెంకటరావమ్మ దంపతులకు జన్మించారు. చిన్నతనం నుంచే ఆయన నోట ప్రతి అక్షరం, ప్రతి అచ్చు అచ్చంగా, స్వచ్ఛంగా పలికాయి. 1942 మేలో పందొమ్మిది సంవత్సరాల వయసులో మేనమామె కుమార్తె బసవతారకంను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్నారు. ఆ కాలంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం, కె.వి.ఎస్. శర్మ వంటి నటులతో కలిసి ఎన్నో నాటకాలు ఆడారు. ఆయన కంచుకంఠంలో స్వరవిన్యాసం, నటవిన్యాసం ఏకకాలంలో ప్రస్ఫుటంగా ప్రకటితమవుతున్నాయని ఆనాడే అందరూ ప్రశంసించారు. 

మనకు స్వాతంత్ర్యం వచ్చిన 1947లోనే బీయే పట్టభద్రుడయ్యారు ఎన్టీఆర్. మద్రాస్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసిన 1100 మందిలో ఉద్యోగానికి అర్హత సాధించిన ఏడుగురిలో ఒకరిగా నిలిచారు. అలా మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్‌గా ఉద్యోగంలో చేరారు. కానీ ఆయన దృష్టి ఉద్యోగం మీద ఉంటేగా! సినిమాల్లో నటునిగా రాణించాలనే తపన ఆయనను నిలువనీయలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి, మద్రాస్ వెళ్లిపోయారు. కొన్ని కష్టాల తర్వాత లెజెండరీ డైరెక్టర్ ఎల్వీ ప్రసాద్ రూపొందించగా 1949లో విడుదలైన 'మనదేశం' చిత్రంలో చేసిన పోలీస్ సబిన్‌స్పెక్టర్ క్యారెక్టర్‌తో సినీ నటునిగా ప్రేక్షకులకు పరియచయమయ్యారు. అప్పుడెవరూ ఊహించలేదు.. నందమూరి తారక రామారావు అనే యువకుడు సమీప భవిష్యత్తులోనే తన సమ్మోహన శక్తితో, అనితర సాధ్యమైన అభినయంతో తెలుగువారి ఆరాధ్య తారగా వెలుగొందుతాడని! 1951లో కె.వి. రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'పాతాళభైరవి' సినిమా ఎన్టీఆర్ నటజీవితాన్ని మలుపు తిప్పింది. తోటరామునిగా తారకరాముడు తెలుగు ప్రజల హృదయాల్ని గెలిచాడు. తన రూపం, వాచకం, అభినయం, ఖడ్గచాలనంతో వారిని సమ్మోహితుల్ని చేసేశాడు. ఆయన నటన ఒక ఎత్తు, నడక మరో ఎత్తు. 

ప్రధానంగా పౌరాణిక చిత్రాలు తారాకరాముని తెలుగువారి ఆరాధ్య దైవంగా మార్చాయి. ఆయనే కృష్ణుడు, ఆయనే సుయోధనుడు.. ఆయనే రాముడు, ఆయనే రావణాసురుడు.. ఆయనే అర్జునుడు, ఆయనే కర్ణుడు.. ఆయనే భీముడు, ఆయనే బృహన్నల.. అన్నీ ఆయనే! తెరపై కనిపించేది ఎన్టీఆర్ కాదు, ఆయా పాత్రలే. శ్రీకృష్ణుడి వాచకం రసరంజితం, సుయోధనుడి వాచకం రాజరాజసం. ఈ రెండు పాత్రలను ఒక్కడే పోషించి, పండించడం ఎన్టీఆర్ ఒక్కరికే చెల్లు. 'లవకుశ' చిత్రంలో చేసిన అపూర్వాభినయంతో తెలుగువారి గుండెల్లో అవతారపురుషుడు శ్రీరాముడు ఆయనే అయిపోయారు. అంతకంటే ముందుగానే 'మాయాబజార్' సినిమాతో శ్రీకృషునిగా నీరాజనాలు అందుకున్నారు. ఆ కాలంలో శ్రీరామ, శ్రీకృష్ణ వేషాల్లో ఉన్న ఎన్టీఆర్ నిలువెత్తు పటాలు, క్యాలెండర్లు.. అనేక తెలుగిళ్లలోని గోడలపై అలంకారాలయ్యాయి. ఆయనే రామునిగా, ఆయనే కృష్ణునిగా భావించి పూజలు చేసిన వాళ్లెందరో! 

తారకరాముడు కేవలం తెరపై గొప్పనటుడు మాత్రమే కాదు, తెరవెనుక మహాగొప్ప దర్శకుడు కూడా! 1961లో వచ్చిన 'సీతారామ కల్యాణం' దర్శకునిగా ఆయన తొలి సినిమా. అయితే సొంత బేనర్ ఎన్ఏటీపై తీసిన ఆ సినిమా టైటిల్స్‌లో దర్శకుని పేరు వేయకుండా రిలీజ్ చేయడం ఆయనకే చెల్లింది. ఇందులో ఆయన రావణాసురుని పాత్రను పోషించారు. దర్శకునిగా తన ప్రతిభ ఏమిటో తొలి సినిమాతోనే ఆయన చాటిచెప్పారు. 1977లో విడుదలైన 'దానవీరశూర కర్ణ' చిత్రంలో శ్రీకృష్ణ, సుయోధన, కర్ణ.. ఇలా మూడు పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం చేసి, మరో చరిత్ర సృష్టించారు.

పౌరాణిక పాత్రలతో తెలుగువారి అవతార పురుషునిగా రాణించిన ఎన్టీఆర్ జానపద, చారిత్రక చిత్రాల ద్వారానూ అమితంగా ఆకట్టుకున్నారు. 'శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర' చిత్రం నిజంగా ఒక చరిత్ర సృష్టించింది. టైటిల్ రోల్‌ను పోషిస్తూ ఆయనే దర్శకత్వం వహించిన ఈ సినిమా 1981లోనే పూర్తయినా, సెన్సార్ చిక్కుల్లో పడి, ఆయన ముఖ్యమంత్రి అయిన కొంతకాలం తర్వాత 1984లో విడుదలైంది. ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.

దాదాపు నాలుగు దశాబ్దాలపాటు తెలుగుసినిమా సామ్రాజ్యానికి చక్రవర్తిగా వెలిగిన నందమూరి తారకరామారావు.. సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక పాత్రల్లో జీవించి, తరించారు. తరగని రసానుభూతుల్ని కోట్లాది మందికి పంచారు. 'మనదేశం'తో మొదలైన మహానటప్రస్థానం 'మేజర్ చంద్రకాంత్' వరకూ జగజ్జేగీయమానంగా సాగింది. జీవనసంధ్యలో, తనకెంతో ఇష్టమైన 'శ్రీనాథ కవిసార్వభౌమ' పాత్ర కూడా పోషించి సంతృప్తిపడ్డారు.

నటునిగా అశేష తెలుగు ప్రేక్షకుల అభిమానానికి పాత్రుడైనందుకు తిరిగి వారికి ఏమైనా ఇవ్వాలనుకున్నారు ఎన్టీఆర్. అదే సమయంలో స్వీయానుభావంతో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కేంద్రం కించపరుస్తున్నదని గ్రహించి, తెలుగువాడి సత్తా ఏమిటో తెలియజెయ్యాలని నిర్ణయించుకున్నారు. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి, కేవలం 9 నెలలకే ఎన్నికల్లో విజయ దుందుభి మోగించి, ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి, నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అన్న కీర్తిని దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొట్టమొదటగా కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని స్థాపించి చరిత్రకెక్కారు. జాతీయ స్థాయిలో తాము మద్రాసీయులం కాదనీ, తెలుగువారమనీ ఘనంగా చాటిచెప్పి ఢిల్లీ పీఠాన్ని వణికించిన ఘనత సాధించారు ఎన్టీఆర్. తెలుగు ఆత్మగౌరవ బావుటాన్ని జాతీయ స్థాయిలో రెపరెపలాడించారు. 

చిన్నా పెద్దా తేడా లేకుండా తెలుగువారందరిలోనూ రాజకీయ చైతన్యం నింపిన ఎన్టీఆర్.. యువతను, విద్యావంతులను, ఆడపడుచులను, వెనుకబడిన వర్గాల వారిని నాయకులుగా, మంత్రులుగా చేశారు. పేదల కోసం, మహిళల కోసం అహరహం తపించారు. పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి, పేదల పాలిట పెన్నిధి అయ్యారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, ఆడపడుచులకు ఆస్తి హక్కు లాంటి పథకాలతో అందరికీ అన్నగారు అయ్యారు. అటు సినీ రంగంలో, ఇటు రాజకీయ రంగంలో ధృవతారగా వెలిగి, 1996 జనవరి 18న మహాభినిష్క్రమణం చేశారు ఎన్టీఆర్. తెలుగువారు ఈ నేలమీద ఉన్నంతవరకూ ఒక శకపురుషునిగా నందమూరి తారకరామారావు పేరు నిలిచే ఉంటుంది. ఇది సత్యం, ఇది తథ్యం.

                                                                                                                                  - బుద్ధి యజ్ఞమూర్తి

ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ప్రత్యేకం