ఎవరి స్క్రిప్టు ఎవరు చదువుతారు?

అంతా నా యిష్టం.. అంతా ఎడాపెడా ఏం చేసినా ఏం చేసినా అడిగేదెవడ్రా నాయిష్టం.. అంటూ తెలుగు సినిమాలో ఓ పాట ఉంది.  అచ్చం అలాగే గత నాలుగేళ్లుగా ఏపీలో జగన్ సర్కార్ తీరు కొనసాగుతోంది. ఆ పార్టీ శ్రేణులూ, నాయకులు అలాగే వ్యవహరిస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి జగన్ సైతం అందుకు వత్తాసు పలుకుతున్నట్లుగానే వ్యవహరించారు. విపక్ష నేతలను కేసుల పేరుతో అర్ధరాత్రులు అరెస్టు చేసినా ఎవరూ మాట్లాడడానికి వీల్లేదన్నట్లుగా సాగిన అధికార పార్టీ నేతల తీరు తీరా తమదాకా వచ్చేసరికి రివర్స్ అయిపోయింది.

తమపై ఉన్న కేసులు కోర్టుల్లో విచారణకు వచ్చినా సహించమన్నట్లుగా ఆ పార్టీ నాయకుల తీరు మారింది. తమ పార్టీకి చెందిన వారికి వ్యతిరేకంగా ఏం జరిగినా కుట్ర అనడం ఆనవాయితీ అయిపోయింది. ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ఈ విషయంలో అందరి కంటే ముందున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మాజీ మంత్రి, ముఖ్యమంత్రి జగన్ సొంత బాబాయ్ హత్య కేసులో నాలుగేళ్ల తరువాత ఆ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి ప్రమేయంపై సీబీఐ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో ముఖ్యమంత్రి జగన్ పేరు ఉండటం వెనుక భారీ కుట్ర ఉందని సజ్జల ఆరోపిస్తున్నారు.

ఎవరో రాసిన స్క్రిప్టునే సీబీఐ కౌంటర్ అఫిడవిట్ లో మెన్షన్ చేసిందని భాష్యం చెబుతున్నారు.  అవినాష్ రెడ్డి సీబీఐ విచారణను తప్పించుకోవడానికి కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిని షెల్టర్ గా చేసుకుని నాలుగు రోజులకు పైగా  తలదాచుకోవడంలో తప్పు లేదు కానీ, ఆయనను అరెస్టు చేసి విచారించాల్సిన అవసరం ఉందని సీబీఐ కోర్టుకు నివేదించడం మాత్రం కుట్ర అంటున్నారు. వివేకా హత్య కేసులో  ఇప్పటికే జగన్ ఓఎస్ డీని సీబీఐ విచారించింది. తెలంగాణ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ లో ఆ విషయాన్ని ప్రస్తావించి అవినాష్ ద్వారా జగన్ కు  తెలిసిందన్న అనుమానం ఉందని కూడా సీబీఐ ఆ అఫిడవిట్ లో విస్పష్టంగా చెప్పింది.

 అయినా కూడా సజ్జల సీబీఐ అలా ఎలా  అంటుంది.. మేం ఏం అంటే అదే చెప్పాలిగా అన్నట్లుగ మాట్లాడుతున్నారు. సీబీఐ దర్యాప్తు వైసీపీ నేతలేం చెబితే అలా జరగాలన్నట్లుగా సజ్జల తీరు ఉంది. ఇంత కాలం సీబీఐ తీరు అలాగే సాగిందన్న ఆరోపణలు ఉన్నాయి. సీబీఐ అవినాష్ దగ్గరకు వస్తోందంటే జగన్ రెక్కలు కట్టుకుని హస్తినలో వాలిపోయేవారు.

వెంటనే సీబీఐ అవినాష్ కు దూరం జరిగేది. ఇలా సాగుతూ వచ్చిన దర్యాప్తు ఇప్పుడు అవినాష్ ను అరెస్టు చేసే వరకూ రావడం చూస్తుంటే..  ఇప్పటి వరకూ జగన్ మాట విని కాపాడిన శక్తులు కూడా అశక్తులయ్యేంతగా అవినాష్ రెడ్డి వివేకా హత్య కేసులో ఇరుక్కు పోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.