సెల్ఫీ మోజులో చంపేశారు
posted on Feb 19, 2016 4:29PM
.jpg)
అవి ఒక అరుదైన జాతికి చెందిన డాల్ఫిన్‌లు. అర్జంటీనా తీరంలో మాత్రమే కనిపించే జీవులు. ఆ అరుదైన జీవులు కాస్తా మనుషుల కంట్లో పడ్డాయి. అంతే! సముద్ర స్నానానికి వచ్చినవారంతా వాటిని తమ చేతుల్లోకి తీసుకుని సెల్ఫీలకు పోజులివ్వడం మొదలుపెట్టారు. చూస్తూ చూస్తుండగానే పదులకొద్దీ జనం వాటిని ఒకరి చేతుల్లోంచి ఒకరు లాక్కొని మరీ ఫొటోలు దిగారు. వాళ్ల చేతుల్లో డాల్ఫిన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నా ఎవరికీ జాలి కలగలేదు సరికదా సెల్ఫీల తాపత్రయంలో ఇంకాస్త గట్టిగా పట్టుకుని దాని ఊపిరికి అడ్డుపడ్డారు.
చివరికి అది చనిపోవడంతో ఏమీ ఎరుగనట్లు ఒడ్డున పడేసి ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. అర్జెంటీనాలోని శాంటా టెరెసిటా అనే నగరంలో జరిగిన ఈ సంఘటన పలువురు జంతుప్రేమికుల ఆగ్రహానికి కారణమైంది. ఆ డాల్ఫిన్ చావుకి కారణమైనవారి మీద కఠిన చర్యలను తీసుకోవాలంటూ అధికారులను కోరుతున్నారు. స్థానిక అధికారులు కూడా మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామంటూ హామీ ఇస్తున్నారు. ఒకవేళ ఎవరికన్నా డాల్ఫిన్ కనిపిస్తే వాటిని తిరిగి సురక్షితంగా నీటిలో విడిచిపెట్టమంటూ ప్రకటనలను గుప్పిస్తున్నారు. సరే!