పాక్ తో యుద్ధం ముగిసినట్టేనా?
posted on May 11, 2025 10:12AM

పాక్ తోక జాడింపులు ఇక్కడితో ఆగినట్టేనా?
భారత్ ఇంకా సాధించవలసిన లక్ష్యాలేంటి?
భారత్ పాక్ వ్యవహారాల నిపుణులు ఏమంటున్నారు?
మే 10 సాయంత్రం 5 గంటల నుంచి భారత్ పాక్ మధ్య యుద్ధ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. అయినా నాలుగు గంటల అనంతరం అంటే రాత్రి 9 గంటలకు పాక్ మన సరిహద్దుల వెంబడి మళ్లీ డ్రోన్ల మోత మోగించడంతో కశ్మీర్ సీఎం ఓమర్ అబ్ధుల్లా కాల్పుల మోత ఆగలేదని.. విరమణ ఒప్పందం అమలు జరగలేదన్న ట్వీట్ తో మరోమారు ఉలిక్కి పడింది ప్రపంచం. మరీ ముఖ్యంగా ఇక యుద్ధం ముగిసిందిలే అని ఊపిరి పీల్చుకున్న ఇరు దేశాల ప్రజలు.. అదిరిపడ్డారు. ఇక మీడియా అయితే తిరిగి యుద్ధ తొడుగులు తొడిగి వార్తలను వండి వార్చడం మొదలైంది.
అంతకు ముందు అమెరికా సగర్వ ప్రకటన చేసింది. ఇదంతా తన వల్లేనని ట్రంప్ కాలర్ ఎగరేశారు. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ట్రంప్ పలికే శాంతి వచనాలకు ఒక అర్ధం లేదు. కారణం ఈ దేశం ఉక్రెయిన్- రష్యా తో యుద్ధంలో ఉండగానే.. అతి పెద్ద ఖనిజ వనరుల ఒప్పందం చేసుకుంది. అంటే ప్రాణాపాయ పరిస్థితులను సైతం క్యాష్ చేసుకోవడం ఈ అగ్ర ఉగ్ర ప్రేరేపిత దేశానికి గన్నుతో పెట్టిన విద్య అన్నమాట.
ఇక భారత్ పాక్ వ్యవహారాల విషయంలోనూ ఇదే చేయాలని చూసింది. కానీ మోడీ ఈ విషయం ముందే గ్రహించి ట్రంప్ కి చెక్ పెట్టారు. అసలు ట్రంప్ మెయిన్ టార్గెట్ ఏంటంటే.. భారత్ ని యుద్ధానికి ఎగదోసి.. ఆయుధాలు కొనిపించాలని. కానీ భారత్ ఈ విషయం ముందే గ్రహించి.. తమ దగ్గరున్న రష్యన్ మేడ్ వార్ వెపన్స్ మాత్రమే వాడడానికి ఆసక్తి చూపింది. రష్యా నుంచి 35 వేల కోట్ల రూపాయల డీల్ ద్వారా దిగుమతి చేసుకున్న ఎస్ 400 తో దాదాపు అనుకున్నంత పని చేసింది.
2018లో ఈ డీల్ కుదురుతున్నప్పుడే యూఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పుడు కూడా ఇదే ట్రంప్ అధికారంలో ఉన్నాడు. మీ మీద ఆంక్షలు గ్యారంటీ అన్నాడు. కట్ చేస్తే భారత్ రష్యాతో తనకున్న పాత అనుబంధాన్ని ఈ మాయా స్నేహం కోసం కోల్పోలేదు. ఇప్పుడు కూడా పాక్ కి మిలియన్ డాలర్ల కొద్దీ డబ్బులిచ్చి.. అక్కడి ఉగ్రవాదులకు ఆయుధాలు అందేలా చేసి.. వారి ద్వారా దాడులు చేయించి.. ఒకయుద్ధ వాతావరణం కల్పించి.. తద్వారా.. భారత్ చేత ఆయుధ అత్యయిక పరిస్థితి కల్పించాలన్నది ఒక ఎత్తుగడ. కానీ భారత్ అయితే రష్యా.. లేకుంటే ఇజ్రాయెల్ మీద ఆధార పడుతుంది కానీ, యూఎస్ మీద కాదు. ఈ విషయం గ్రహించిన అమెరికా తనకున్న పెద్దన్న పాత్రను వెంటనే గుర్తు చేసుకుని.. భారత్- పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి కృషి చేశారు. ఇలాగైనా పరువు దక్కించుకుందామని.
ఈ మొత్తం ఎపిసోడ్ లో చైనా సీనేంటని చూస్తే మీ సార్వభౌమత్వానికి భంగం కలిగితే మేము మద్ధతునిస్తామని చెప్పి... తన దృష్టినంతా బలూచిస్తాన్ మీదే పెట్టింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ.. గానీ బలూచిస్తాన్ ని ఆక్రమించుకుంటే... పాక్ నుంచి విడిపోతే.. తమ ఫోకస్ మొత్తం షిఫ్ట్ చేద్దామని చూసింది. అయితే ఆ పని పూర్తి కాక పోవడంతో తీవ్ర నిరాశ చెందింది డ్రాగన్ దేశం. కారణం తమకు కావల్సింది పాక్ కాదు. పాక్ ఆధీనంలో ఉన్న బలూచిస్తాన్. అక్కడున్న అపారమైన ఖనిజ వనరుల మీదే ఈ దేశపు ధ్యాసంతా. అందుకే తామక్కడ గ్వాదర్ పోర్టు నిర్మించింది. అందుకే అక్కడ హైబ్రిడ్ రోడ్లు వేసింది. అందుకే అక్కడ ఇతర ఎన్నో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసింది. ఈ విషయం గుర్తించిన బలూచీలు.. చైనీయులను తిప్పి కొడుతుంటే.. కూడా లెక్క చేయక ఎయిర్ పోర్టులను నిర్మించింది. బలూచీలు కూడా పట్టు వదల్లేదు. తమను అడ్డు పెట్టుకుని పాక్ చైనాతో చేస్తున్న దందాను గుర్తించి. ఆ దేశ ట్రైన్ ని హైజాక్ చేశారు. ఆపై క్వెట్టాలోని పాక్ స్థావరాలపై దాడి చేశారు. ఇంకా ఎన్నో రకాలుగా పాక్ ని దెబ్బ తీసే యత్నం చేశారు. బలూచిస్తాన్ లో మూడొంతుల్లో రెండు వంతుల భూభాగం తమ పరం చేసుకున్నారు. ఆ కార్యక్రమం కూడా పూర్తయి ఉంటే అప్పుడు తెలిసేది చైనా పూర్తి నైజం.
ఇవన్నీ ఇలా ఉంచితే.. పాకిస్తాన్ కి కూడా లోపల ఏమంత సజావుగా లేదు. పార్లమెంటులో ఎంపీల నుంచి బయట సాధారణ ప్రజల వరకూ అందరూ కలసి ఆ దేశ ప్రభుత్వానికి, సైన్యానికీ తమ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇక ఇమ్రాన్ పార్టీ కార్యకర్తలు సైతం రోడ్లపైకి వచ్చి.. ఇదొక దమ్ములేని ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. తమ అధినేత ఇమ్రాన్ని విడిపించి పాక్ ని రక్షించాలని డిమాండ్ చేశారు.
దానికి తోడు భారత్ కరాచీ పోర్టు వంటి వాటిని ధ్వంసం చేసి.. దిగుమతులను సైతం లేకుండా చేయడం.. ఆల్రెడీ దేశంలో ఉన్న కరువు కాటకాలు. వాటికి తోడు ప్రతిదీ ఎదురు తిరగడం. ఉన్న ఆ కొద్ది మంది ఉగ్రవాదులు కూడా చనిపోవడంతో ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉంది. ఈ కండీషన్లో.. ట్రంప్ ఇలా ఫోన్ చేయడం ఆలస్యం అలా.. కాల్పుల విరమణకు ఓకే చెప్పేసింది పాక్. ఆ దేశ మిలటరీ డీజీ భారత్ మిలటరీ డీజీతో డీల్ ఓకే చెప్పేశాడు. అయితే బుద్ధిలేని పాక్ దళాలు ఎప్పటిలాగానే తమ పాత బుద్ధిని ప్రదర్శిస్తూ.. మన సరిహద్దుల వెంబడి తిరిగి కాల్పులు జరిపాయి.
ఇవన్నీ ఇలా ఉంచితే.. పాకిస్తాన్ ఈ కాల్పుల విరమణకు తలొంచడానికి రకరకాల సమస్యలు. ఇంత యుద్ధం జరుగుతుంటే తమను ఆర్ధికంగా ఆదుకోమంటూ ఎక్స్ లో పోస్టులు పెట్టిన దారుణమైన పరిస్థితి. దీంతో ఈ పాపిష్టి దేశం కాల్పులను విరమించుకోవడంలో ఒక అర్ధముంది కానీ.. భారత్ ఇంకా పట్టు పట్టి ఉండాల్సిందంటారు నిపుణులు.
ఈ సారికి పీవోకే స్వాధీనం చేసుకుని ఉండాల్సింది. అక్కడి ఉగ్ర మూకల స్తావరాలను ధ్వంసం చేయడంతో సరి పెట్టకుండా ఉండాల్సిందంటారు యుద్ధ నిపుణులు. అంతే కాదు బలూచిస్తాన్ సైతం పాక్ నుంచి వేరు పడి ఉండే వరకూ యుద్ధం కంటిన్యూ చేసి ఉండాల్సింది. ఆ దేశ ఉగ్ర ముఖాలైన హఫీజ్, మసూద్ లను అప్పగించే వరకూ కాల్పులను విరమించమని తెగేసి చెప్పి ఉండాల్సింది. ఈ మూడు విషయాలైనా.. పాక్ తో మనం పట్టు వదలకుండా డిమాండ్ చేసి ఉండాల్సిందంటారు పాక్ వ్యవహారాల నిపుణులు.