లైఫ్ స్టైల్ ను ఇబ్బందిపెట్టే షుగర్ ను గుర్తించండి ఇలా!

ఒకప్పటి కాలంలో శారీరకకష్టం ఎక్కువగా ఉండేది. అందుకే తీసుకునే ఆహారం ఎలాంటిది అయినా, ఆ ఆహారం ద్వారా శరీరానికి అందే కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఏమాత్రం నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శరీరంలో శక్తిని రిలీజ్ చేస్తూ కరిగిపోయేవి. అయితే శారీరక కష్టం తగ్గిపోయి కేవలం మానసికంగా మనుషులు ఇబ్బంది పడుతూ ఉద్యోగాలు చేస్తున్న ఈ కాలంలో తినే ప్రతి ఆహారం చూసుకొని తినాల్సి వస్తోంది. 

మనం సాధారణంగా కార్బోహైడ్రేట్లు, కొవ్వులు  కలిగిన ఆహారం తిన్నప్పుడు అవి శరీరంలో చెక్కెరలుగా మారతాయి. మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ ఆ చెక్కెరలను క్రమబద్దం చేస్తుంది. అదే శరీరంలో తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోతే శరీరంలో చెక్కరలు మెల్లిగా పెరుగుతూ పోతాయి. అదే షుగర్ సమస్యకు దారితీస్తుంది. రక్తంలో షుగర్ స్థాయిలు ఎక్కువ ఉండటం చాలా ప్రమాదకరం.

షుగర్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది??

షుగర్ లెవల్స్ ఎక్కువ ఉండటం మొదట్లో పెద్దగా సమస్యగా ఉండకపోవచ్చు కానీ అది దీర్ఘకాలం కొనసాగితే  శరీరంలో అంతర్గత అవయవాలు దెబ్బతింటాయి. అవి క్రమంగా తమ పనితీరును మందగింపజేస్తాయి. మెదడు పనితీరు తగ్గిపోతుంది. శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ వ్యవస్థ తగ్గిపోతుంది. దీనివల్ల చిన్న చిన్న సమస్యలకే అనారోగ్యానికి గురవడం, వాటి నుండి కోలుకోలేకపోవడం జరుగుతుంది. కొన్నిసార్లు షుగర్ స్థాయిలు చాలా ఎక్కువైపోయినప్పుడు కోమాలోకి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఆ షుగర్ స్థాయిలను సులభంగా గుర్తించే కొన్ని మార్గాలు అందరికోసం. 

షుగర్ స్థాయిలు అధికంగా ఉన్న వాళ్లలో అలసట, నీరసం ఎక్కువగా ఉంటాయి. మెట్లు ఎక్కగానే అలసిపోవడం, తక్కువ దూరం నడవగానే చెమటలు పట్టడం, పని ఎక్కువగా చేయలేకపోవడం వంటి సమస్యలు ఉంటాయి.

చాలామందిలో చిరాకు కనిపించినప్పుడు మనుషుల్ని అపార్థాలు చేసుకుంటారు. అయితే చిరాకు అనేది మానసిక మరియు శారీరక అనారోగ్య సమస్య.  చక్కెర స్థాయిలు ఎక్కువైనప్పుడు కలిగే మార్పుల వల్ల మానసిక ఒత్తిడి పెరిగి చిరాకుకు దారితీస్తుంది.

అతిగా దాహం వేయడం షుగర్ స్థాయిలు ఎక్కువ ఉన్న వాళ్ళలో కనిపించే మరొక లక్షణం. ఈ అతిదాహం వల్ల నీరు ఎక్కువగా టాగుతూ ఉంటారు.

ఎక్కువగా మూత్రవిసర్జనకు వెళ్లడం షుగర్ సమస్యకు సూచన. అతిగా దాహం వేయడం వల్ల మూత్రవిసర్జనకు వెళ్లడం కూడా అధికం అవుతుంది. 

చక్కెర స్థాయిలు పెరగడం వల్ల చూపు విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. సాధారణం కంటే షుగర్ స్థాయిలు ఎక్కువున్నపుడు దృష్టి మందగిస్తుంది.

ఆహారం విషయంలో ఎలాంటి మార్పులు చేసుకోకపోయినా బరువు విషయంలో అనుహ్య మార్పులు చోటుచేసుకుంటాయి.

జననేంద్రియం చుట్టూ విపరీతమైన దురద ఉంటుంది. 

ఆయాసంగా అనిపించడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

అన్నిటికంటే ముఖ్యంగా ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల శరీరం ఇన్ఫెక్షన్ లకు తొందరగా గురవుతుంది.  పలితంగాఏమైనా సమస్యలు వస్తే తొందరగా తగ్గవు.

ఈవిధంగా సాధారణ లైఫ్ స్టైల్ లో మనం తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా లేకపోతే చక్కెర స్థాయిలు మెల్లిగా పేరుకుపోయి అది జబ్బుగా మారి బోలెడు సమస్యలను సృష్టిస్తుంది.

                               ◆ వెంకటేష్ పువ్వాడ.