డిల్లీ సీయం కేజ్రీవాల్ డిల్లీ గవర్నర్ తో యుద్ధం
posted on May 16, 2015 9:50PM
.jpg)
డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పై యుద్ధం ప్రకటించారు. డిల్లీ ప్రధాన కార్యదర్శి కెకె. శర్మ స్వంత పని మీద శలవుపెట్టి అమెరికా వెళ్ళడంతో, తాత్కాలికంగా ఆ బాధ్యతలు శకుంతల గామ్లిన్ అనే ఐ.ఏ.యస్. అధికారిణికి అప్పగిస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ చేసారు. కానీ ఆవిషయం తన ప్రభుత్వానికి తెలియజేయకుండా, అనుమతి తీసుకోకుండా గవర్నర్ ఆమెకు బాధ్యతలు అప్పగించి తన పరిధిని అతిక్రమించారని, రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించారని కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయన శకుంతలను బాధ్యతలు స్వీకరించవద్దని ఆదేశించారు. కానీ ఆమె కేజ్రీవాల్ ఆదేశాలను లెక్కచేయకుండా ఈరోజు సాయంత్రం నుండి ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు స్వీకరించడంతో కేజ్రీవాల్ మరింత ఆగ్రహం చెందారు. ఈ వ్యవహారం గురించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పిర్యాదు చేసేందుకు అపాయింట్ మెంట్ కోరారు. కానీ డిల్లీకి లెఫ్టినెంట్ గవర్నరుగా వ్యవహరిస్తున్న తనకు సెక్షన్ 239ఎఎ ప్రకారం ఏ అధికారినయినా నియమించే అధికారాలున్నాయని గవర్నర్ నజీబ్ జంగ్ స్పష్టం చేసారు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయకుండా గవర్నర్ ఈవిధంగా ప్రధాన కార్యదర్శిని నియమించవచ్చా లేదా? నియమిస్తే ఆ వ్యక్తిని బాధ్యతలు స్వీకరించవద్దని ముఖ్యమంత్రి చెప్పడం తప్పా ఒప్పా? అనే విషయాలు న్యాయ నిపుణులే తేల్చాలి. కనుక ఒకవేళ రాష్ట్రపతి కూడా ఎటువంటి చర్యలు తీసుకోనట్లయితే కేజ్రీవాల్ గవర్నర్ ఆదేశాలను సవాలు చేస్తూ కోర్టుకి వెళ్లినా ఆశ్చర్యం లేదు.