కాంగ్రెస్ కోరి తెచ్చుకున్న ఓటమి!
posted on Mar 8, 2025 8:37AM

జో జీతేగా ఓయీ సిఖందర్.. గెలిచినవాడే రాజు, ఏమి చేశారు, ఎలా గెలిచారు, అనేది తర్వాత చర్చ. తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎనికల్లో బీజేపీ రెండు స్థానాలు గెలుచుకుంది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంతో పాటు, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కమల దళం తమ ఖాతాలో కలుపుకుంది.మూడింట రెండు ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ గెలుచుకోవడం సహజంగానే బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ముఖ్యంగా, కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కరీంనగర్ పట్టభద్రుల సీటును బీజేపీ కైవసం చేసుకోవడం, బీజేపీలో జోష్ పెంచింది. కాంగ్రెస్ ను కృంగదీసింది. మరోవంక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో రాష్ట్ర రాజకీయ సమీకరణలలోమార్పు మొదలైందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, బీజేపీ, బీజేపీ అనుకూల మీడియా మేథావులు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మార్పునకు సంకేతంగా భావిస్తుంటే.. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందమే, తమ ఓటమికి కారణమని కాంగ్రెస్ నాయకులు.. సామాన్య ప్రజలపై ఓటమి ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక విధంగా ఇది పరవు నిలుపుకునే ప్రయత్నం. బీజేపీ దూకుడుకు బ్రేకులు వేసే ప్రయత్నం.
మరోవంక, రాష్ట్ర బీజేపీ నాయకులు అయితే, చిటారు కొమ్మన మిఠాయి పొట్లం చేతికి అందినట్లే సంబర పడి పోతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మొదలు బీజేపీ రాష్ట్ర నాయకులు రాష్ట్రంలో నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పతనం ప్రారంభమైందని సంబర పడి పోతున్నారు.
అదే సమయంలో రహస్య పొత్తులు, లోపాయికారీ ఒప్పదాల పై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ బరిలో నిలవక పోవడం, బీఎస్పీ బరిలో నిలవడం కమల దళానికి ఉభయ తారకంగా కలిసొచ్చిన అంశాలుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపధ్యంలోనే బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అలాగే కాంగ్రెస్ నాయకుల మధ్య సమన్వయ లోపం, అభ్యర్ధిని ప్రకటించడంలో జాప్యం, ఇలా కాంగ్రెస్ ఓటమికి చాలానే కారణాలు ఉన్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
అదెలా ఉన్నా.. బీజేపీ అనుసరిస్తున్న నూతన ప్రచార వ్యూహం, ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు నిబద్దతతో సాగించిన ప్రచారం కమల దళానికి కలిసొచ్చిందని అంటున్నారు. అవును రాజకీయ అనుబంధ బాంధవ్యాలతో సంబంధం లేకుండా, రాజకీయ విశ్లేషకులు అందరూ ప్రశంస పుర్వకంగానో, ఆందోళన పూర్వకంగానో కాషాయ బీజేపీ క్యాడర్ కమిట్మెంట్ ను మెచ్చుకుంటున్నారు. చివరకు పార్టీని సైద్ధాంతికంగా వ్యతిరేకించే వామపక్ష మేథావులు సైతం బీజేపే క్యాడర్ ఐడిలాజికల్ కమిట్మెంట్’తో పనిచేయడం వల్లనే బీజేపీ మూడింట రెండు సీట్లు గెల్చుకుందని అంగీకరిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రణాళిక బద్ధంగా పార్టీ కార్యకర్తలు చేసిన ప్రచారం, బీజేపీ గెలుపునకు ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. అంతే కాదు, కమిట్మెంట్ తో పనిచేసే క్యాడర్ బీజేపీ అసలు బలంగా విశ్లేషకులు గుర్తిస్తున్నారు.
మరోవంక కాంగ్రెస్ పార్టీలో నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం లేక పోవడంతో చే చేతులా గెలుపును చేజార్చుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి కాంగ్రెస్ అభ్యర్ది నరేంద్ర రెడ్డి, ఆరు నెలల ముందు నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. కొత్త ఓటర్లను చాలా పెద్ద సంఖ్యలో చేర్పించారు.అలాగే కాంగ్రెస్ టికెట్ ఆశించి చివరకు బీఎస్పీ అభ్యర్ధిగా బరిలో దిగిన ప్రసన్న హరికృష్ణ కూడా ముందు నుంచి క్షేత్ర స్థాయిలో పని చేశారు. అయితే చివరికి టికెట్ రాక పోవడంతో ఆయన బీఎస్పీ టికె పై పోటీకి దిగి, బీజేపీ అభ్యర్ధి గెలుపునకు పరోక్షంగా సహకరించారు. నిజానికి కాంగ్రెస్ నాయకత్వం హరికృష్ణ, నరేంద్ర రెడ్డి మధ్య సయోధ్య కుదిర్చి ఒకరే బరిలో నిలిచేలా చేసుంటే, కాంగ్రెస్ విజయం నల్లేరు మీద నడకలా సాగేది. అందుకే కాంగ్రెస్ ఓటమికి ఇంకా అనేక కారణాలు ఉన్నా, నాయకుల మధ్య సమన్వయ లేకపోవడం, క్యాడర్ లో ఉత్సాహం, కమిట్మెంట్ లేక పోవడం కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరో విషయమేంటంటే.. పార్టీ రాష్ట్ర స్థాయి నాయకత్వం గెలుపు పై అంతగా దృష్టి పెట్టలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కానీ చివరకు, శుభం పలకరా .. పెద్దన్నా అంటే కాంగ్రెస్ అభ్యర్ధి నరేంద్ర రెడ్డి ఓడిపోయినా తమ ప్రభుత్వానికి వచ్చే ముప్పేమీ లేదన్న చక్కటి సందేశం ఇచ్చివచ్చారు. పీసీసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నాయకులకు దిశా నిర్దేశం చేయడంలో శ్రద్ద చూపలేదు.
పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోని ఆ నాలుగు జిల్లాలో కేవలం నలుగురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న బీజేపీ కార్యకర్తలను కలుపుకుని గెలుపే లక్ష్యంగా ప్రచారం సాగిస్తే.. కాంగ్రెస్ పార్టీకి 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నా క్యాడర్ ను సక్రమంగా ఉపయోగించుకోలేదని అంటున్నారు. నిజానికి కాంగ్రెస్ అభ్యర్ధి నరేంద్ర రెడ్డి కూడా ఇంచుమించుగా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. పరోక్షంగానే అయినా క్షేత్ర స్థాయిలో తాను ఒంటరి పోరాటం చేయవలసి వచ్చిందనే ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ విధంగా చూసినప్పుడు ఇదొక రకంగా కాంగ్రెస్ పార్టీ కోరి తెచ్చుకున్న ఓటమి .. బీజేపీ పోరాడి సాధించిన విజయం అంటున్నారు.