ఓటమి భయం.. బాబాయ్ హత్య కేసు.. జగన్ ఉక్కిరిబిక్కిరి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిలో అసహనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రాజకీయంగానే కాకుండా సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తన పేరు ప్రస్తావించడం, అలాగే సొంత సోదరి ఏపీ రాజకీయాలలో వేలు పెట్టేందుకు, కాలు పెట్టేందుకు సమాయత్తమౌతుండటం, కర్నాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో వరుస భేటీలతో ఆమె ఆస్తుల విషయంలో కూడా జగన్ కు పక్కలో బల్లెంగా మారడం ఇవన్నీ ఆయనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆయన ఎక్కడ ఏం మాట్లాడుతున్నారన్న విచక్షణ మరచి ప్రభుత్వ కార్యక్రమమా, పార్టీ కార్యక్రమమా అన్న తేడా కూడా లేకుండా విపక్ష నేతపై విమర్శలు గుప్పించడమే ఏకైక కార్యక్రమంగా, సింగిల్ పాయింట్ అజెండాగా మాట్లాడుతున్నారనీ అంటున్నారు. ఆయన ప్రసంగాలే ఆయనలోని ఫ్రస్ట్రేషన్ ను ఎత్తి చూపుతున్నాయంటున్నారు. ఒక వైపు వచ్చే ఎన్నికలలో ఓటమి భయం, మరో వైపు వివేకా హత్య కేసులో విచారణను ఎదుర్కొనవలసి ఉంటుందన్న ఆందోళనతో ఆయన సంయమనం కోల్పోతున్నారని చెబుతున్నారు.  

ఇక పార్టీ పరంగా చూస్తే వైసీపీలో అసమ్మతి సెగలు, అసంతృప్తి జ్వాలలూ నెల్లూరులో మొదలైనా అవి రాష్ట్రం మొత్తం వ్యాపించడం, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, చివరాఖరికి ఉప ముఖ్యమంత్రి కూడా అసమ్మతిని, అసంతృప్తిని బహిరంగంగా వెల్లగక్కడంతో పార్టీలో లుకలుకలు రోడ్డున పడ్డాయి.  దీంతో వైనాట్ 175 ధీమా కోల్పోయి.. కనీసం విజయం సాధిస్తే చాలన్న పరిస్థితికి జగన్ వచ్చేశారని పార్టీ శ్రేణులో అంటున్నాయి.  ఇదిలా ఉంటే ఇంత కాలం  ఆర్థిక అరాచకత్వం సహా  జగన్ సర్కార్ చేసే ప్రతి పనికీ, తీసుకునే ప్రతి నిర్ణయానికీ మద్దతు ఇస్తూ వస్తున్న కేంద్రంలోని మోడీ సర్కార్ ఇటీవల కాలంలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది.

మరీ ముఖ్యంగా నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోడీ జగన్ ను అత్యంత ముక్తసరిగా పలకరించడంతో కేంద్రం నుంచి జగన్ కు ఇక సహకారం అందే అవకాశాలు అంతంత మాత్రమేనని పరిశీలకులు అంటున్నారు. ఈ వరుస పరిణామాల నేపథ్యంలోనే గురువారం (జూన్1) ఉమ్మడి కర్నూలు జిల్లా పత్తికొండలో వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమంలో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి నగదు బదలీ చేసిన జగన్ ఆ సందర్బంగా చేసిన ప్రసంగం యావత్తూ విపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబును దుమ్మెత్తి పోయడానికే సరిపోయిందని అంటున్నారు. ఈ సందర్భంగా ఆయనలో ఓటమి భయం, విపక్షం పుంజుకుంటోందన్న ఆక్రోషం ప్రస్ఫుటంగా బయటపడ్డాయని సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు.

తన సభల నుంచి జనం గుంపులు గుంపులుగా వెళ్లిపోతుండటం.. అదే సమయంలో చంద్రబాబు సభలకు, లోకేష్ పాదయాత్రకు జనం అసంఖ్యాకంగా హాజరౌతుండటం జగన్ లో  గుబులు పెంచాయనడానికి నిదర్శనమే..పత్తికొండ సభలో మహానాడును తెలుగుదేశం డ్రామా కంపెనీతో పోల్చడం అని విశ్లేషిస్తున్నారు.ఇక చంద్రబాబును  సత్యం పలకడు, ధర్మానికి కట్టుబడడు, మాట మీద నిలబడడు, విలువలు.. విశ్వసనీయత అనేవి లేని వ్యక్తిగా అభివర్ణించడాన్ని ఎత్తి చూపుతూ జగన్ తన లక్షణాలన్నీ చంద్రబాబుకు ఆపాదించారని తెలుగుదేశం శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి.

 ఓ ప్రభుత్వ కార్యక్రమంలో  ప్రభుత్వాధినేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే ఆయనగారిలోని ప్రెస్ట్రేషన్  ఫీక్స్‌కు చేరిందని రాజకీయవర్గాలు అంటున్నాయి. అలాగే చివరిలో తన ప్రభుత్వంపై విపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మకండి ప్లీజ్ అంటూ ప్రజలను వేడుకోవడం చూస్తుంటే..  వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ రెక్కలు విరిచేందుకు ప్రజలు పక్కాగా ఫిక్స్ అయిపోయారని జగన్ కు అర్ధమైపోయినట్లుందని అంటున్నారు.