బీజేపీతో జగన్ చీకటి ఒప్పందం.. CPI నారాయణ

ఇంత కాలం కేంద్ర దర్యాప్తు సంస్థలే కేంద్రం పంజరంలో చిలుకగా మారిపోయాయని అనుకున్నాం. అయితే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏకంగా ప్రాంతీయ పార్టీలనే బంధిత పార్టీలు (captive parties)గా మార్చేసుకుందా? అంటే ఔననే అంటున్నారు సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అంటూ జగన్ నేతృత్వంలోని వీసీపీని చూసిప్తున్నారు. ఔను ఆయన వైసీపీ, బీజేపీ మధ్య క్విడ్ ప్రోకో తరహా ఒప్పందం జరిగిందని గట్టిగా చెబుతున్నారు. ఇటీవలి కాలంలో వరుసగా జరిగిన పరిణామాలు.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పక్షం రోజుల వ్యవధిలో ఏపీ సీఎం జగన్ రెండు మార్లు హస్తినకేగి రావడం వెనుక ఉన్నది ఈ ఒప్పందమేనని నారాయణ చెబుతున్నారు.

ఇంతకూ ఆ ఒప్పందం ఏమిటి అంటే.. జగన్ అక్రమాస్తుల కేసు.. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ గెలుపునకు లింకు పెట్టే ఒప్పందమని వివరంగా చెబుతున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. వివేకా హత్య కేసు నుంచి జగన్ సన్నిహితులు, బంధువులను బయటపడేయాలంటే.. జగన్ తన అక్రమ సంపాదనను కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయం కోసం ఖర్చు పెట్టాలన్నదే ఆ ఒప్పందం అని చెబుతున్నారు. అధికార వైసీపీ నారాయణ ఆరోపణలను నిర్ద్వంద్వంగా ఖండించినా.. ఆ ఆరోపణలు వాస్తవమే అయి ఉండొచ్చన్న అనుమానాలు మాత్రం పొలిటికల్ సర్కిల్స్ లోనూ, పరిశీలకులలోనూ కూడా వ్యక్తం అవుతున్నాయి. 

 మొదట వివేకా హత్య కేసు విషయానికి వస్తే.. ఈ కేసులో సీబీఐ విస్పష్టంగా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిని అరెస్టు చేయనున్నట్లు తెలంగాణ హైకోర్టుకు తెలియజేసింది. ఇహనో ఇప్పుుడో వారిరువురూ అరెస్టు కావడం ఖాయమన్నట్లుగా బిల్డప్ ఇచ్చింది. అంతా నిజమేననుకున్నారు. సరిగ్గా ఈ తరుణంలోనే.. సిరికిం జెప్పడు అన్నట్లుగా జగన్ హడావుడిగా హస్తినకు వెళ్లారు. అక్కడ ప్రధాని మోడీతో, హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్ర అంశాలపైనే వారిరువురితో భేటీ అయినట్లు ప్రభుత్వం షరా మామూలు అన్నట్లుగా ఒక ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకుంది. ఈ నాలుగేళ్లలో ఇలాంటి భేటీలు ఎన్నో జరిగాయి. ప్రతి భేటీ సందర్భంగానూ ఇటువంటి ప్రకటనలే వెలువడ్డాయి.దీంతో వాటిని జనం నమ్మడం మానేశారు.

అయితే వివేకా హత్య కేసులో సీబీఐ  అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తామని చెప్పిన వెంటనే జగన్ హస్తిన వెళ్లారు. అంతే సీబీఐ అరెస్టు మాట ఏమైందో కానీ, ఆ కేసు అక్కడే ఆగిపోయింది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ పరాభవం, అలాగే వివేకా హత్య కేసులో అవినష్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిలు దరఖాస్తు, ఉపసంహరణల నేపథ్యంలో జగన్ మరోసారి హస్తిన వెళ్లారు. అంతే కాదు.. అర్ధరాత్రి హడావుడిగా అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ భేటీలో ఏం చర్చ జరిగిందన్నది యథాప్రకారం బయటకు వెల్లడి కాలేదు. ఆ తరువాత మోడీతోనూ జగన్ బేటీ అయ్యారు. పనిలో పనిగా కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. ఇక్కడే సీపీఐ నారాయణ తన ఆరోపణలను పకడ్బందీగా ఎక్కుపెట్టారు. మోడీ, అమిత్ షా లతో మాత్రమే భేటీ అయితే రాజకీయ బేటీయే అన్నది నిర్ధారణ అయిపోతుందన్న అనుమానంతోనే మొక్కుబడి తంతుగా విత్త మంత్రిని కలిశారనీ, అయితే అసలు క్విడ్ ప్రోకో ఒప్పందం అమిత్ షాతో భేటీలోనే కుదిరిపోయిందనీ నారాయణ ఆరోపిస్తున్నారు.

కేసుల నుంచి జగన్ అండ్ కోను బయటపడేయడానికి ఆయన తన అక్రమ సంపాదనను కర్నాటకలో బీజేపీ విజయం కోసం ఖర్చుచేయాలన్నదే ఆ ఒప్పందమని నారాయణ అన్నారు. అందుకు ప్రతిగా వివేకా హత్య కేసులో జగన్ అండ్ కోకు ఇబ్బందులు రాకుండా కేంద్రంలోని బీజేపీ సహకరిస్తుందన్నదే ఆ ఒప్పందం అని నారాయణ ఆరోపించారు. ఏపీలో పరిస్థితులు, జగన్ బదనిక తరహాలో అప్పులు, కేసులు ఇలా ప్రతి విషయంలోనూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఆధారపడి ఉండటం చూస్తుంటే.. నారాయణ ఆరోపణలు వాస్తవమేనని భావించాల్సి వస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.