సడెన్ గా రంగు మార్చిన ఈటల.. రాజకీయ వర్గాల్లో రచ్చ!
posted on May 24, 2021 1:57PM
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సడెన్ గా రంగు మార్చేశారు. ఈటల రంగు మార్చడం ఇప్పుడు సంచనంగా మారింది. ఇటీవలే కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కు గురయ్యారు ఈటల. తనను కేసీఆర్ అవమానకరంగా తొలగించాలని ఆయన రగిలిపోతున్నారు. గులాబీ బాస్ పై రివేంజ్ తీర్చుకోవడానికి సిద్దమవుతున్నారు. హుజురాబాద్ తో పాటు హైదరాబాద్ లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అటు ఈటెలకు పోటీగా టీఆర్ఎస్ కూడా కౌంటర్ యాక్షన్ స్టార్ చేసింది. ఇంతలోనే ఈటల రంగు మార్చడం చర్చగా మారింది. ఆయన ఏం చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది.
కేసీఆర్ పై కారాలు మిరియాలు నూరుతున్న ఈటల రాజేందర్ సడెన్ గా ఏం చేశారో తెలుసా.. తన ట్విట్టర్ అకౌంట్ లో మార్పులు చేశారు. గులాబీ రంగులకు తిలోదకాలు ఇచ్చేశారు. ఇప్పటి వరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో తన బొమ్మతోపాటు టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఫొటో కనబడేది. వాల్ మొత్తం గులాబీ రంగుతో ఉండేది. కానీ ఇప్పుడువన్నీ మాయమై పోయాయి. ఈటల రాజేందర్ ట్విట్టర్ వాల్ మీద గులాబీ రంగు గయాబ్ అయింది. కేసిఆర్ బొమ్మను పీకి పడేశారు ఈటల. గులాబీ రంగును వదిలేసి ఆకుపచ్చ రంగు వాల్ ను పెట్టారు. వాల్ మీద మహానీయులైన పూలే, అంబేద్కర్, తెలంగాణ జాతి పిత జయశంకర్ సార్ ఫొటోలను ఒకవైపు.. తెలంగాణ తల్లి, అమరవీరుల స్థూపం చిత్రాలు మరోవైపు పెట్టారు. మధ్యలో పిడికిలి బిగించిన చేతిని ఉంచారు ఈటల రాజేందర్.

ఈటల భూఅక్రమాలకు పాల్పడ్డారని ఆగమేఘాల మీద మంత్రివర్గం నుంచి తొలగించారు కేసీఆర్. విచారణ కమిటీలు ఏర్పాటు చేసి ఈటల అవినీతిని యుద్ధ ప్రాతిపదికన వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈటల రాజేందర్ టిఆర్ఎస్ తో పూర్తి స్థాయిలో తెగతెంపులకు సిద్ధపడ్డారు. ట్విట్టర్ వేదికగా కేసిఆర్ బొమ్మలు పీకేసి తన దారి ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పేశారు రాజేందర్. ‘‘సంధి లేదు మిత్రమా… సమరమే’’ అన్న ధోరణి ఈటల రాజేందర్ పెట్టిన చిత్రాన్ని చూస్తే తెలిసిపోతోంది. ఇక వాల్ మీద ఉన్న పూలే, అంబేద్కర్, జయశంకర్ సార్ చిత్రాలను పరిశీలిస్తే తెలంగాణలో పీడత వర్గాల రాజ్యం లేదు… దొరల రాజ్యం ఉందన్న భావనను కల్పించే రీతిలో ఈటల సమాజానికి సంకేతాలు పంపినట్లు తన సన్నిహితులు చెబుతున్నారు. పూలే, అంబేద్కర్ ఫోటోల ద్వారా.. బడుగు, బలహీన వర్గాల అజెండగానే ముందుకు వెళ్తాననే సందేశం ఈటల ఇచ్చారంటున్నారు. ఈటల తాజా అడుగులతో ఆయన బీసీ వాయిస్ గానే భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
మరోవైపు ఈటల రాజేందర్ సొంత నియోజకర్గంలో హుజురాబాద్ లోనే రాజకీయాలు వేడెక్కాయి. అధికార పార్టీ తీవ్ర ఫోకస్ చేయడంతో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. ఇంతకాలం ఈటలకు మద్దతుగా ఉన్న నేతలు అధికార పార్టీలోనే ఉండేలా గులాబీ లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఇదే పనిలో ఉన్నారు మంత్రి గంగుల కమాలకర్. మండలాలు, గ్రామాల వారీగా టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నేతలతో ఆయన మాట్లాడుతున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో ట్రబుల్ షూటర్ హరీష్ రావు కూడా రంగంలోకి దిగారని తెలుస్తోంది. హుజురాబాద్ నేతలతో హరీష్ రావు స్వయంగా మాట్లాడుతున్నారని చెబుతున్నారు. ఈటల రాజీనామా చేస్తే జరగబోయే అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఇంచార్జ్ బాధ్యతలను హరీష్ రావుకే అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది .టీఆర్ఎస్ స్పీడ్ పెంచడంతో రాజేందర్ కూడా అప్రమత్తమయ్యారని అంటున్నారు. అందుకే ట్విట్టర్ అంకౌంట్ లో ఫోటో మార్చి తన సందేశం చెప్పారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.