కరోనా భయంలో జనాలు.. జల్సాల్లో వైసీపీ లీడర్లు 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. మరణాలు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. ఆక్సిజన్ అందక రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. సీఎం జగన్ సొంత జిల్లాలో కడపలోనూ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆక్సిజన్ కొరతతో పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా భయంతో జనాలు హడలిపోతున్నారు. 

కరోనా కల్లోల సమయంలో జనాలకు అండగా నిలవాల్సిన నేతలు జల్సాలు చేస్తున్నారు. ఇలాంటి విపత్కార పరిస్థితుల్లో ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కరోనా బాధితులకు అండగా ఉంటూ.. వారికి మేమున్నామనే భరోసా ఇవ్వాలి. కానీ వైసీపీ ఎమ్మెల్యేల రూటే సపరేట్‌గా ఉంది. కడప జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తుంటే ప్రజల బాధలను గాలికొదిలేసిన వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం గుర్రాలపై స్వారీ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

రాజంపేట మండలం ఆకేపాడులో మాజీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఎస్టేట్‌లో వైసీపీ నేతలు సరదాల్లో మునిగితేలారు. అమర్‌నాథ్ రెడ్డితోపాటు ప్రభుత్వ చీప్ విప్ శ్రీకాంత్ రెడ్డి, కోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కొరుముట్ల శ్రీనివాసులు, కడప మేయర్ సురేష్ బాబు సరదాగా ఎస్టేట్‌లో ఎంజాయ్ చేశారు. అమర్‌నాథ్ రెడ్డికి చెందిన గుర్రాలను తీసుకుని ఎస్టేట్‌కు దగ్గరలో ఉన్న చెయ్యేరు నది పరిసరాల్లో గుర్రపుస్వారీ చేస్తూ ఎంజాయ్ చేశారు. 

అధికార పార్టీ నేతలు గుర్రాలపై స్వారీ చేస్తూ జల్సాలు చేస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వైసీపీ నేతల తీరుపై  స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనాలు భయంతో చస్తుంటే పట్టించుకోకుండా సరదాల్లో మునిగిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సీఎం సొంత జిల్లాలోనే వైసీపీ నేతల పరిస్థితి ఇలా ఉంటే... రాష్ట్రమంతా ఎలా ఉంటుందో ఊహించవచ్చు.  ఇలాంటి నేతలను ఎన్నుకున్నందుకు సిగ్గుపడుతున్నామంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.