ఏపీలో క్రియేటర్ అకాడమీ.. టెజరాక్ట్, యూట్యూబ్ అకాడమీలతో ఎంఓయూ
posted on Jul 29, 2025 3:32PM
.webp)
ఏపీలో సృజనాత్మక ఆర్థిక వృద్ధి కోసం క్రియేటర్ అకాడమీని స్థాపించడానికి ఐటీ మంత్రి నారా లోకేష్ సమక్షంలో కీలక అవగాహన ఒప్పందం జరిగింది. సింగపూర్ షాంగ్రీలా హోటల్ లో జరిగిన కార్యక్రమంలో టెజరాక్ట్ ప్రెసిడెంట్ తేజ ధర్మ, యూట్యూబ్ అకాడమీ ఇండియా హెడ్ అర్జున్ దొరైస్వామి, ఏపీ ప్రభుత్వం ఐటీ కార్యదర్శి కాటంనేని భాస్కర్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం సృజనాత్మక కంటెంట్ తయారీ కోసం ఏపీ ప్రభుత్వం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేస్తుంది. పాఠ్యాంశాలు, శిక్షణ కార్యక్రమాలకు గూగుల్ సంస్థ వనరులు, సాంకేతికత, నైపుణ్యాలను అందించనుండగా.. టెజారాక్ట్ సంస్థ ఫిజికల్ సెటప్, నిర్వహణ, రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది.
డిజిటల్ కంటెంట్ పరిశ్రమలో విజయం సాధించేందుకు ఔత్సాహికులను సన్నద్దం చేయడం, వారికి అవసరమైన నైపుణ్యం, వనరులు సమకూర్చడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందించడమే ఒప్పందం ప్రధాన ఉద్దేశమని ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ చెప్పారు.