జగన్ పులివెందుల కోటకు బీటలు!

వైసీపీకి పులివెందుల పెట్టని కోట. అక్కడ వైఎస్ కుటుంబం ఏం చెబితే అది.. అన్నట్లుగా సాగుతుంది. అలాంటి పులివెందులలో అనూహ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో తెలుగుదేశం భారీ ఆధిక్యత సాధించింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి 4323 ఓట్లు వస్తే.. వైసీపీకి 2120 ఓట్లు వచ్చాయి. పులివెందులలో జగన్ కోటకు బీటలు వారాయని ఈ అంకలే నిర్ద్వంద్వంగా నిరూపిస్తున్నాయి. కంచుకోట లాంటి పులివెందులలో జగన్ పట్టు సడలడానికి ఆయన స్వయంకృతాపరాధమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

వైఎస్ బతికి ఉన్నంత కాలం  ఆయన, వైఎస్ వివేకానందరెడ్డి వేరు వేరని నియోజకవర్గంలో ఎవరూ కనీసం ఊహలో కూడా అనుకుని ఉండరు. అయితే వైఎస్ మరణాననంతరం జరిగిన పరిణామాలలో జగన్ వైఎస్ వివేకాను దూరం పెడుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అందుకు జగన్ వైసీపీ స్థాపించి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన తరువాత కూడా వైఎస్ వివేకా కాంగ్రెస్ లోనే కొనసాగారు. అంతే కాదు సొంత వదినపై పోటీ కూడా చేశారు. సరే అన్నీ సర్దుకున్నాయి వైఎస్ వివేకా జగన్ పార్టీలో చేరిపోయారు. కానీ గత ఎన్నికల ముందు అంటే 2019 ఎన్నికల ముందు వైఎస్ వివేకా దారుణ హత్యకు గురయ్యారు. హత్యకు గురైన తొలి నాళ్లలో ఈ హత్య విషయంలో జగన్ ఫ్యామిలీపై ఎవరికీ ఎటువంటి అనుమానాలూ రాలేదు.

కానీ ఇప్పుడు సీబీఐ దర్యాప్తు తరువాత ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్న వాస్తవాల నేపథ్యంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాత్రపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అలాగే అవినాష్ రెడ్డిని కాపాడేందుకు జగన్ చేస్తున్న ప్రయత్రాలు కూడా సందేహాలను ఇనుమడింప చేస్తున్నాయి. అన్నిటికీ మించి తన తండ్రి హత్య కేసులో పాత్ర ధారులు, సూత్ర ధారులు ఎవరో తెలియాల్సిందే అంటూ న్యాయపోరాటం చేస్తున్న వివేకా కుమార్తె  డాక్టర్ సునీతకు అడుగడుగునా ఎదురౌతున్న అడ్డంకులు, ఆమెపైనా, ఆమె భర్తపైనా అవినాష్ తాజాగా చేసిన ఆరోపణల నేపథ్యంలో పులివెందులలో సహజంగానే జగన్ సోదరికి అండగా నిలవక పోవడానికి కారణమేమిటన్న చర్చ మొదలైంది. అలాగే   వైఎస్ కుటుంబంలో ఏర్పడిన పరిణామాలతో జగన్, అవినాష్ రెడ్డిల తీరుపైనా పులివెందుల ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. అందుకు తార్కానమే ఇటీవల వైఎస్ వివేకా వర్ధంతి కార్యక్రమంలో వెలసిన ఫ్లెక్సీలు పోస్టర్లలో వైఎస్ కుటుంబానికి చెందిన అందరి ఫొటోలు ఉన్నాయి కానీ సీఎం జగన్, ఎంపీ అవినాష్ ల చిత్రాలకు వాటిలో చోటు లేకుండా పోయింది.

ఇటీవలి కాలంలో జగన్ పై పులివెందులలో వ్యక్తమౌతున్న వ్యతిరేకత వల్లే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కంటే తెలుగుదేశం అభ్యర్థికే ఎక్కవ ఓట్లు పోలయ్యాయని అంటున్నారు. ఇందుకు జగన్ పై వ్యతిరేకతే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదే ట్రెండ్ అసెంబ్లీ ఎన్నికలలో కూడా కొనసాగే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయనీ చెబుతున్నారు.