జాతీయ రాజకీయాలకు కేసీఆర్ ఇంట్రవెల్?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఇంకా ఏంతో దూరంలో లేవు... మే  వరకు గడువున్నా, రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా రావచ్చునని అంటున్నారు. మరో వంక, బీజేపీ, కాంగ్రెస్, జనతా దళ్( ఎస్) పార్టీలు ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నాయి. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర ముఖ్యనాయకులు అందరూ రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.  అలాగే  కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, పార్టీ సుప్రీం లీడర్ రాహుల్ గాంధీ మరో రెండు రోజుల్లో అంటే సోమవారం ( మార్చి 20) బెల్గాంలో జరిగే యువజన్ సమ్మేళనంలో పాల్గొంటారు.   అదే రోజున కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల తోలి జాబితా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే  హంగ్  అంచనాలతో జేడీ(ఎస్) నేత  మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి పార్టీకి మైసూర్  ప్రాంతంలో పట్టును నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నుంచే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయ ప్రస్థానం మొదలవుతుందని, ప్రకటించిన కేసీఆర్  ఎందుకో ఆ రాష్ట్రం వైపు కన్నెత్తి చూడటంలేదు.కర్నాటక అసెంబ్లీ ఎన్నికలో బీఆర్ఎస్ పోటీ దిశగా ఆ పార్టీలో ఎక్కడా చలనం కనిపించడం లేదు.  ఇప్పుడు  బీఆర్ఎస్ ముఖ్యులంతా  ఢిల్లీ మద్యం కుంభకోణంలో  అనుమానితురాలుగా విచారణ ఎదుర్కుంటున్న పార్టీ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కేసీఆర్  కుమార్తె  కల్వకుంట్ల కవితను కాపాడుకోవడం ఎలా? టీఎస్పీఎస్సీ   పరిక్ష పత్రాల లీకేజీ కుంభకోణం నుంచి బయట పడడం ఎలా?  అనే విషయాలపైనే దృష్టిని కేద్రీకరించారని జరుగుతున్న పరిణామాలను బట్టి అందరికీ అర్థమౌతోంది.  

మరోవంక  బీఆర్ఎస్ తొలి  అడుగు నుంచి కేసీఆర్ తో కలిసి నడిచిన, జేడీ (ఎస్) అధ్యక్షుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి ఎందుకో ఏమో కానీ మెల్ల మెల్లగా కేసీఆర్ కు దూరమవుతున్నారు. నిజానికి, అప్పట్లో, బీఆర్ఎస్,  జేడీ(ఎస్) మధ్య పొత్తు ఖరారైందనే వార్తలు కూడా వచ్చాయి. హైదరాబాద్ తెలంగాణగా ప్రసిద్ధి చెందిన కర్ణాటక సరిహాద్దు ప్రాంతంలో ముఖ్యంగా తెలుగువారున్న చోట్ల బీఆర్ఎస్ పోటీ చేస్తుందని మిగతా చోట్ల జేడీఎస్‌కు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని చెప్పుకున్నారు.

అయితే  ఇప్పడు కుమారస్వామి, కేసీఆర్ మధ్య దూరంపెరిగిన నేపధ్యంలో  కుమరస్వామి హైదరాబాద్ వైపు కన్నెత్తి చూడడం లేదు. బీఆర్ఎస్ పార్టీతో పొత్తు విషయాన్ని పూర్తిగా  మరిచి పోయారు. ఇప్పటికే ఆయన తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్ధుల తొలి జాబితాను ప్రకటించారు. మరో వంక  బీఆర్ఎస్ నాయకత్వం కూడా కర్ణాటకలో పోటీ చేసే ఆలోచనను  పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా  ముందు తెలంగాణ గండం గట్టెక్కితే, ఆ తర్వాత జాతీయ రాజకీయాల గురించి అలోచించ వచ్చనే నిర్ణయానికి బీఆర్ఎస్ వచ్చినట్లు తెలుస్తోంది. 

అదలా ఉంటే, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్ననేపథ్యంలో జాతీయ రాజకీయాలకు తాత్కాలిక విరామం ఇచ్చి ప ముందు రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేదెలా, అనే విషయంపైనే దృష్టిని కేంద్రీకరించాలని పార్టీ ‘పెద్దలు’ కూడా సూచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఏదైనా అంతిమ నిర్ణయం తీసుకోవలసింది మాత్రం ముఖ్యమంత్రి కేసీఅర్, మంత్రి కేటీఆర్.  ఆ ఇద్దరి నిర్ణయం పైనే బీఆర్ఎస్ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని అంటున్నారు.