ఎక్కడో ఏదో తేడా కొట్టింది.. అందుకే జగన్ ఢిల్లీ యాత్ర!?

వైఎస్ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తనపై సీబీఐ కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరుతూ వేసిన రిట్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. అలాగే అవినాష్ రెడ్డి తదుపరి విచారణపై స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పేసింది. దీంతో   అవినాష్‌రెడ్డికి ఉన్న ఒకే ఒక్క దారి సైతం మూసుకుపోయినట్లైంది. మరోవైపు ఇదే కేసులో  అవినాష్ రెడ్డి గురువారం సీబీఐ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉన్నా.. ఆయన డుమ్మా కొట్టారు. ఇటువంటి పరిణామం ఏదో చోటు చేసుకొనే అవకాశం ఉందని ముందుగానే ఆయన ఊహించి డుమ్మా కొట్టేశారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతోంది. ఈ నేపథ్యలోనే జగన్ హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అదీ కాక మంగళవారం  (మార్చి 14 వైఎస్ వివేకా హత్య కేసులో వైయస్ అవినాష్ రెడ్డి నాలుగో సారి సీబీఐ  విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ కేసులో కీలక అధారాలను ముందు పెట్టి మరీ సీబీఐ అధికారులు వరుసగా ప్రశ్నలు సంధించడంతో... కడప ఎంపీ ఒకానొక సందర్భంలో మౌనంగా ఉండిపోయారనే కథనాలు   మీడియాలో వెల్లువెత్తాయి.  

అంతేకాకుండా వివేకా హత్య కేసులో ముందు ముందు మరింత మందిని అంటే.. వైఎస్ కుటుంబంలోని కీలక వ్యక్తులను సైతం సీబీఐ పిలిచి విచారించే అవకాశాలు  ఉన్నాయని.... ఇటువంటి పరిస్థితుల్లో మరో గత్యంతరం లేకే సీఎం జగన్ ఆదరా బాదరాగా ఢిల్లీకి ప్రయాణం కట్టారనే టాక్ వినిపిస్తోంది. ఇంకో వైపు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బడ్జెట్ సమావేశాలు జరుగుతోన్నా కూడా సీఎం జగన్.. ఢిల్లీ వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఇక ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలతో సీఎం వైయస్ జగన్ అపాయింట్‌మెంట్ కోసం ఫ్యాన్ పార్టీలో కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా ప్రయత్నించి.. సఫలీకృతులయ్యారనే టాక్ సైతం నడుస్తోంది. 

ఇక సీఎం జగన్ ఇంత ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనపై అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో విభిన్న కథనాలు వెల్లువెత్తాయి. అవేమంటే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించడం కోసం..  అలాగే సంక్షేమ పథకాలు కోసం మరింత అప్పు కావాలని విజ్జప్తి చేయడం కోసం...  విశాఖ వేదికగా ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు వివరాలు వివరించడం కోసం.. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు వివరించడం కోసం.. ఢిల్లీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటుకు భూమి కేటాయించాలని విజ్జప్తి చేయడం కోసం.... అలాగే కోడి కత్తి కేసులో ఏప్రిల్ 10న విచారణకు హాజరు కావాలంటూ.. వైయస్ జగన్‌తోపాటు ఆయన పీఏ కేఎన్ఆర్‌కి విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు ఆదేశించడం... తదితర అంశాలను మోదీ, అమిత్ షా ద్వయంతో సీఎం వైయస్ జగన్ ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయంటూ సదరు కథనాలు వివరిస్తున్నాయి. 

అయితే ఈ అంశాలను చర్చించాలంటే.. మరి ఇంత హడావుడిగా సీఎం   జగన్ ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదని  పోలిటికల్ సర్కిల్‌లో ఓ చర్చ జరుగుతోంది. కానీ మరీ ఇంత హడావుడిగా అప్పటికప్పుడు సీఎం  జగన్ హస్తినకు,  అదీ ప్రత్యేక విమానంలో ప్రయాణం కట్టడం చూస్తుంటే ఎక్కడో... ఏదో... ఏదో తేడా కొడుతోందనే ఓ టాక్   పోలిటికల్ సర్కిల్‌లో రచ్చ రంబోలా చేసి పారేస్తోంది.