వామ్మో కరోనా... మరో షాకింగ్ న్యూస్

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు రికార్డ్ స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. హాస్పిటల్స్ లో బెడ్లు దొరక్క రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కరోనాకు సంబంధించి మరో షాకింగ్ విషయం బయటికి వచ్చింది. ఇంతకాలం కరోనా వైరస్‌ యువతను ఏం చేయదులే అనే భరోసాలో ఉండగా.. సెకండ్‌వేవ్‌లో పరిస్థితి తల్లకిందులైంది. ప్రస్తుతం యువతే ఎక్కువగా కరోనా భారీన పడుతున్నారని తెలుస్తోంది.

ఇటీవల కాలంల ోకొవిడ్‌తో ఆస్పత్రిలో చేరుతున్నవారిలో 45 ఏళ్ల లోపు వారి సంఖ్య అధికంగా ఉంటోంది. తెలుగు రాష్ట్రాల్లో నమోదు అవుతోన్న పాజిటివ్‌ కేసుల్లో 43 శాతం 21-45 ఏళ్ల గ్రూపులోనివారివేనని వైద్య ఆరోగ్యశాఖ గణాంకాల చెబుతున్నాయి. మార్చి రెండో వారం నుంచి  సెకండ్‌వేవ్‌ ప్రారంభమైంది. మార్చి 12 నుంచి కేసులు పెరుగుతుండగా, నెల రోజుల వ్యవధిలో ఏకంగా తెలంగాణలో 28,812 పాజిటివ్‌లు వచ్చాయి. అందులో 12,677 మంది 21-45 ఏళ్లలోపువారే. ఇక మరణాల విషయంలోనూ ఇతర దీర్ఘకాలిక లక్షణాలున్న వారు 56 శాతం ఉంటే, ఎటువంటి జబ్బుల్లేకుండా కేవలం కొవిడ్‌ వల్లే చనిపోయిన వారు 44 శాతం మంది ఉన్నారు. 

ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కువగా యువతే చికిత్స తీసుకుంటున్నారని వైద్య వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్‌ ఆస్పత్రిలో నిత్యం 30 వరకూ అడ్మిషన్లు ఉంటే అందులో 20 వరకు యువతకు సంబంధించినవే ఉంటున్నాయట. పలు శాఖలున్న మరో కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 250 మంది పాజిటివ్‌ల్లో 40 శాతానికిపైగా 40 ఏళ్లలోపువారే. గత రెండు వారాలుగా ఈ పరిస్థితి ఉందని ఆస్పత్రుల సిబ్బంది చెబుతున్నారు. గత ఏడాది కరోనా బాధితులలో అధిక శాతం మంది 50 ఏళ్లపైబడిన వారే ఉండేవారు. ఆస్పత్రుల్లో చేరేవారు, వెంటిలేటర్‌ అవసరమయ్యేవారు.. 60 ఏళ్లు పైబడినవారే ఎక్కువగా ఉండేవారు. వారిలో ఇన్ఫెక్షన్‌ తీవ్రత ఎక్కువగా  ఉండేది. ఇప్పుడు అదే పరిస్థితి 40 ఏళ్లలోపువారిలో కూడా ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. 

కొద్దిరోజులుగా ఐసీయూ చికిత్స అవసరమవుతున్న ప్రతి పది మందిలో ఒకరు 30 ఏళ్ల లోపు ఉంటున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. 25 నుంచి 40 ఏళ్ల వయస్సు వారిలోకూడా ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ పెట్టాల్సి వస్తోందని వారు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. వారు ఆస్పత్రి పాలవడానికి కారణం.. సకాలంలో చికిత్స తీసుకోకపోవడం, ‘మాకు ఏం కాదులే’ అనే నిర్లక్ష్యంతో ఉండడమేనని వైద్యులు తెలిపారు.చాలామంది తమ స్నేహితులతో దగ్గరగా మసలడం, ఆలింగనం చేసుకోవడం, చేతులు కలిపి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకోవడం, ఒకే బైక్‌పై ఇద్దరు, ముగ్గురు ప్రయాణం చేయడం, మాస్కులు పెట్టుకోకపోవడంతో కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తోంది. సిగరెట్‌ను షేర్‌ చేసుకోవడం వల్ల వైరస్‌ నేరుగా ఒకరి నుంచి మరొకరి నోటిలోకి ప్రవేశిస్తోంది. దీనివల్ల వైరల్‌ లోడ్‌ కూడా ఎక్కువగా ఉంటోంది. ఒకరికొకరు దగ్గరగా ఉన్నప్పుడు పాజిటివ్‌ వ్యక్తులు దగ్గితే.. ఆ తుంపర్లు నేరుగా ఎదుటి వ్యక్తి ముక్కులోకి, నోటిలోకి ప్రవేశిస్తున్నాయి. వైరస్‌ అత్యంత వేగంగా ఊపరితిత్తులకు పాకుతోంది.

దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధిక శాతం మహారాష్ట్ర, పంజాబ్‌ తదితర 11 రాష్ట్రాలవే. వాటిలో కూడా ఎక్కువ కేసులు 15 నుంచి 44 ఏళ్లలోపువారిలోనే నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ ఇటీవల ఒక సమావేశంలో ప్రకటించారు. బస్సులలో తిరగడం, ఆటోలు ఎక్కడం, బస్సులలో ఊళ్లకు ప్రయాణం చేస్తుండడంతో కరోనా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వేగంగా విస్తరిస్తోంది.