సెకండ్ వేవ్ ప్రభావం మహిళలపైనే ఎక్కువ
posted on May 11, 2021 1:58PM
దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా కరోనా మొదటి దశలో పురుషుల మీద ఎక్కువ ప్రభావం చూపింది. అలాగే, తెలంగాణలో కూడా తొలి దశలో కరోన సోకినవారిలో పురుషుల సంఖ్య అధికంగా ఉంది. కరోనా ఫస్ట్ వేవ్ స్త్రీల మీద అంతగా ప్రభావం చూపలేదు. ఓక్ విధంగా మహిళల పట్ల కనికరం చూపింది.
అయితే,ఇప్పుడు కొనసాగుతున్నరెండవ దశలో మాత్రం కరోనా బారిన పడిన మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని తెలంగాణ ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాలు సూచిస్తున్నాయి. తొలి దశలో అత్యధికంగా గత జూన్’లో 34 శాతం మంది మహిళలు కొవిడ్ 19 బారిన పడితే, ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్ 19 కేసుల్లో కోవిడ్ బారిన పడిన మహిళలు 38.5 శాతానికి చేరుకుంది.
ఈ సంఖ్య, ఈ నిష్పత్తి ఈ సారి ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దేశంలో కూడా తొలి దశలో కంటే రెండవ దశలో ఎక్కువ మంది మహిళలు కొవిడ్ బారిన పడుతున్నారు. ప్రస్తుతం దేశం మొత్తంలో నమోదైన్ కేసుల్లో, తెలంగాణలో కంటే కొద్దిగా తక్కువగా 36 శాతం వరకు మహిళలు కొవిడ్ బారిన పడ్డారు. అలాగే ఐసీయులో చేరుతున్న మహిళల సంఖ్య, కొవిడ్’ మహమ్మారికి బలవుతున్న మహిళల సంఖ్య కూడా గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా ఉందని గణాంకాలు సూచిస్తున్నాయి.మరణాలలో స్త్రీ, పురుషులు శాతం ఇంచుమించుగా సమానంగా, ఉందని అధికార తాజా సమాచారం సూచిస్తోంది.
గతంలో కొవిడ్ బాధిత మహిళల్లో 33 శాతం మందికి ఐసీయులో చేరితే, ప్రస్తుతం ఐసీయులో చికిత్స పొందుతున్న వారిలో మహిళల నిష్పత్తి 39 శాతానికి చేరింది.ఎక్కువ సంఖ్యలో మహిళలకు కొవిడ్ సోకడం, వైరస్ స్వభావంలోవచ్చిన మార్పుకు సంకేతమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మహిళలు సహజంగా బయటకు వెళ్లరు. కొవిడ్ నిబంధనలను పురుషులకంటే మరింత నిష్టగా, ఖచ్చితంగా పాటిస్తారు. కాబట్టి, పురుషులతో పోల్చి నప్పుడు వారికి వైరస్ సోకే అవకాశం తక్కువగా ఉంటుంది. అందుకే, మహిళల్లో కేసులు పెరుగతున్న కేసుల్లో ఎక్కవ భాగం యుక్త వయసు వారే ఉంటున్నారని నిపుణులు చెపుతున్నారు.
థర్డ్ వేవ్..
ఇదిలా ఉంటే, ప్రస్తుతం తీవ్ర ప్రభావం చూపుతున్న సెకండ్ వేవ్ చివరిది కాదని, మరో నెలరోజుల్లోగా ప్రస్తుత ఉదృతి తగ్గినా, మరో మూడు నెలలో (అక్టోబర్ – డిసెంబర్ మధ్య) థర్డ్ వేవ్ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతే కాదు,థర్డ్ వేవ్ పిల్లల మీద ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. తొలి దశలో పిల్లలపై కరోనా ప్రభావం చాలా తక్కువగా వుంది. కేవలం 4 శాతం మంది పిల్లలపై మాత్రమే కరోనా ప్రభావం చూపింది. అంటే, పిల్లలలో నాలుగు శాతం మంది మాత్రమే కరోనా బారిన పడ్డారు. కానీ, ప్రస్తుతం కొనసాగుతున్న సెకండ్ వేవ్’లో 15 నుంచి 20 శాతం మంది వరకు పిల్లలు కొవిడ్ 19 బారిన పడ్డారు. ఇక థర్డ్ వేవ్ వస్తే, పిల్లలే ప్రధాన టార్గెట్ అవుతారని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే, 80 నుంచి 85 శాతం మంది పిల్లలపై కొవిడ్ 19 ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అమ్మలు జగ్రత్తమ్మా..
దేశంలో అందరికీ వాక్సిన్ పడే వరకు, కూడా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శారీరక శుభ్రత, పరిసరలాను శుభ్రం ఉంచుకోవడం, ఎప్పటికప్పుడు ప్రభుత్వం, వైద్య నిపుణులు సూచించే సలహాలను పాటించడం తప్పని సరని, ఫస్ట్ వేవ్ సర్డుమణిగి నప్పటికీ, సెకండ్ వేవ్ తప్పదని శాస్త్రవేత్తలు చేసిన హెచ్చరికలను, ప్రజలు, ప్రభుత్వాలు పెడచెవిన పెట్టినందునే ప్రస్తుత పరిస్థితి వచ్చిందని, ఈసారి అయినా, ప్రజలు, ప్రభుత్వాలు మూడు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.