తెలంగాణలో లాక్ డౌన్ ఎప్పటి నుంచి?
posted on May 11, 2021 12:28PM
తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ తప్పదా? అంటే అవుననే తెలుస్తోంది. లాక్ డౌన్ పై హైకోర్టు సీరియస్ గా స్పందిస్తుండటం, మంత్రివర్గ సమావేశం జరుగుతుండటంతో తెలంగాణలో లాక్ డౌన్ ఖాయమని తెలుస్తోంది. అయితే లాక్ డౌన్ ఎప్పటి నుంచి పెడతారన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈనెల 14న రంజాన్ పండుగ ఉంది. దీంతో రంజాన్ తర్వాతే.. అంటే మే 15 నుంచి లాక్ డౌన్ పెట్టవచ్చనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే విపక్షాలు లాక్ డౌన్ అంశంపై సర్కార్ ను నిలదీస్తున్నాయి. ఓ వర్గం కోసమే లాక్ డౌన్ పెట్టడం లేదని ఆరోపిస్తున్నారు. సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయని, కేసీఆర్ సర్కార్ మాత్రం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుందని మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు.
తాజాగా మంగళవారం కూడా కరోనా కట్టడిపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై బుధవారం జరగాల్సిన విచారణను.. అత్యవసరంగా ఈరోజే విచారించిన న్యాయస్థానం ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడింది. తెలంగాణలో కరోనా పరీక్షలు తగ్గడం, ప్రస్తుత పరిస్థితులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నైట్ కర్ఫ్యూ విధించినప్పటికీ పలు ప్రాంతాల్లో అమలు కావడం లేదని.. ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీలో నిబంధనలు పాటించకపోవడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆదేశించింది. లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకోవాలని చెప్పిన రోజే.. అవసరం లేదని ప్రభుత్వం నిర్ణయం ఎలా తీసుకుంటుందని.. కోర్టు ధిక్కారణ నోటీసులు ఇస్తామని హెచ్చరించింది. దీనికి బదులుగా ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఏజీ.. మధ్యాహ్నం కేబినెట్ సమావేశంలో లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు.
హైకోర్టుకు ఏజీ నివేదన ప్రకారం లాక్ డౌన్ పై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం ఖాయమని తెలుస్తోంది. అయితే ఎప్పటి నుంచి లాక్ డౌన్ అమలు చేస్తారన్నది ఆసక్తిగా మారింది. విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగానే రంజాన్ తర్వాత నుంచే లాక్ డౌన్ విధిస్తారా లేక ముందే అమలు చేస్తారా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. రంజాన్ ముగిసేవరకు ఆగకుండా వెంటనే రాష్ట్రంలో లాక్ డౌన్ విధించాలనే డిమాండ్ మెజార్టీ వర్గాల నుంచి వస్తోంది.