టీ కాంగ్రెస్ నేతలు దానంకు చెక్ పెడుతున్నారా?
posted on Dec 11, 2015 4:23PM
.jpg)
దానం నాగేందర్ పార్టీ మార్పుపై హై డ్రామానే జరిగిందని చెప్పాలి. తాను పార్టీ మారట్లేదు అని చెపుతూనే.. చీకటిలో టీఆర్ఎస్ నేతలతో మంతనాలు జరపడం.. ఆఖరికి తను ఆశించింది రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తి లేదు అని చెప్పడం.. ఇవన్నీ దానం ఎత్తుగడలను చూపించాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు దానం కు చెక్ పెట్టాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీమంత్రి ముఖేష్ గౌడ్ ను రంగంలోకి దించనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు రెండు రోజుల క్రితమే ముఖేష్ గౌడ్ తో మాట్లాడారంట. అయితే ముఖేష్ కు నగర కాంగ్రెస్ కమిటీ బాధ్యతలు అప్పగిస్తారా? లేక పీసీసీలో మరేవైనా బాధ్యతలు అప్పగిస్తారా అన్న విషయంపై చర్చలు జరుగుతున్నాయి. కాగా ముఖేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2014 ఎన్నికల్లో ప్రస్తుతం గోషమహల్ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ పై పోటీ చేసి ఓడిపోయారు. దాంతో ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. పార్టీ కార్యక్రమాల్లో దేనిలో పాల్గొనకుండా దూరంగా ఉన్నారు.
అయితే ఇప్పుడు దానం ఎఫెక్ట్ తో కాంగ్రెస్ ముఖేష్ గౌడ్ ను తెరపైకి తెచ్చింది. దీంతో మళ్లీ ముఖేష్ గౌడ్ పార్టీలో క్రియాశీలకం కానున్నారు. ఒకవేళ ముఖేష్ గౌడ్ కు నగర కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తే... దానం నాగేందర్ కు ఏఐసీసీ లేదా పీసీసీ కీలక బాధ్యతలు అప్పగించే అంశంపైనా చర్చించినట్లు సమాచారం. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ముందే మేల్కొని.. దానం ఎప్పుడైనా పార్టీకి ఝలక్ ఇవ్వొచ్చని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి కాంగ్రెస్ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి..