తెలంగాణలో కాంగ్రెస్ గాలి.. పార్టీలోకి వలసలపై హైకమాండ్ తో రేవంత్, భట్టి చర్చలు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ బలం పుంజుకుంటోంది. పార్టీలోకి అధికార తెరాస నుంచి వచ్చి చేరుతున్న నేతలే ఇందుకు నిదర్శనం. ముందు ముందు ఈ చేరికలు భారీగా ఉండే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్న నేపథ్యంలో వారి అంచనాలు వాస్తవమేననడానికి రుజువులు లభించాయి. చేరికల విషయమై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హస్తిన చేరుకున్నారు.

వీరిరువురూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్వి కేసీ వేణుగోపాల్ తో బేటీ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ లోకి వలసలు వరదలా పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో బేటీ అయ్యారు. ఈ భేటీలో వీరి మధ్య తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, బీజేపీ, టీఆర్ఎస్ లోపాయికారీ మైత్రి అంశం సహా పలు అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా పార్టీలోకి చేరికలు పెరగడం, రాహుల్ వరంగల్ పర్యటన తరువాత పార్టీలో పెరిగిన జోష్,  విద్యార్థి, నిరుద్యోగ డిక్లరేషన్, దళిత, గిరిజన డిక్లరేషన్ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.

 అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీలో చేరికలపై స్థానిక అంశాలు, వ్యూహాత్మక వ్యవహరాలు సహా అన్ని విషయాలనూ దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళతామని రేవంత్ చెప్పారు. పార్టీలోకి ఇంకా ఎవరెవరు రానున్నారు అన్న విషయాలను ముందుగా బయటకు చెప్పడం సరికాదని రేవంత్ అభిప్రాయపడ్డారు. తెరాస నుంచి కాంగ్రెస్ లోకి వలసలు వెల్లువెత్తుతాయని మాత్రం చెప్పగలనని రేవంత్ అన్నారు. అయితే ఎవరెవరు వస్తున్నారన్న వివరాలను ముందుగా వెల్లడించడం సరికాదన్న రేవంత్ అలా చేస్తే చేరే వారిపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఆపే అవకాశం ఉందన్నారు. పార్టీలోకి ముందు ముందు పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నాయన్న ఆయన ఆ విషయంలో అధిష్టానం నుంచి స్పష్టత తీసుకున్నామని చెప్పారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు, టికెట్ల విషయంపై ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందన్నారు.

పార్టి టికెట్ల కేటాయింపు అన్నది ఎన్నికలు వచ్చినప్పుడు ఒక నిర్దుష్ట ప్రక్రియ ప్రకారం జరుగుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.  గెలుపు గుర్రాలు అన్న ఒక్క అంశమే కాకుండా.. పార్టీ పట్ల విశ్వసనీయత, నిబద్ధత కూడా టికెట్ల కేటాయింపు విషయంలో పరిగణనలోనికి తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ అన్నా, ఇప్పుడు జాతీయ పార్టీ అంటున్నా అంతా ప్రధాని మోడీకీ, బీజేపీకి ఉపయోగపడేందుకు మాత్రమేనని రేవంత్ అన్నారు. మోడీకి ప్రయోజనం చేకూరేలా విపక్షాలలో చీలిక తెచ్చేందుకే కేసీఆర్ ప్రయత్నమంతా అని ఆరోపించారు. అందుకే రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎంపిక కోసం నిర్వహించిన సమావేశానికి కేసీఆర్ హాజరు కాలేదని రేవంత్ ఆరోపించారు.

మమతా బెనర్జీ ఆధ్వర్యంలో విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికకు సమావేశం జరిగిన రోజు బీజేపీ ఓడిపోయే పరిస్థితి ఉందని అందుకే కేసీఆర్ ఆ సమావేశానికి డుమ్మా కొట్టారని రేవంత్ చెప్పారు.  అయితే నవీన్ పట్నాయక్, ఇతర పార్టీలూ ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించిన అనంతరం, అంటే బీజేపీ విజయంపై స్పష్టత వచ్చాకే కేసీఆర్ విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు.

ఇక సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచీ కాంగ్రెస్ లోకి వలసలు ఉంటాయని చెప్పారు. చేరికల జాబితాపై హైకమాండ్ తో చర్చించామన్నారు. టీఆర్ఎస్ నుంచే కాకుండా ఇంకా పలు పార్టీల నుంచి కూడా చేరికలు ఉంటాయనీ, దశల వారీగా, విడతల వారీగా ఈ చేరికలుంటాయని వివరించారు. కేసీఆర్, మోడీల కపట నాటకాన్ని ప్రజలకు వివరిస్తామని అన్నారు. ఇక కాంగ్రెస్ లో గ్రూపు విభేదాల గురించి అడిగిన ప్రశ్నకు బిన్నాభిప్రాయాలను బేధాభిప్రాయాలుగా చూడటం తగదని భట్టి బదులిచ్చారు.