అప్పుడు తెలంగాణా, ఇప్పుడు సీమాంధ్ర నేతలతో

 

ఇంత కాలంగా టీ-కాంగ్రెస్ నేతల రాజకీయ జీవితాలతో చెలగాటమాడి రాక్షాసానంధం అనుభవించిన కాంగ్రెస్ అధిష్టానం, ఇప్పుడు సీమాంధ్ర కాంగ్రెస్ నేతల రాజకీయ జీవితాలతో ఆట మొదలు పెట్టింది. ఒకప్పుడు తెరాస, టీ-జేఏసీ, టీ-విద్యార్ధుల ఆగ్రహానికి గురయిన టీ-కాంగ్రెస్ నేతలు అధిష్టానంతో తమ పరిస్థితి గురించి ఎంత మోర పెట్టుకొన్నపటికీ పట్టించుకోకపోవడం వలన, పార్టీలో అత్యంత సీనియర్ నేతలు కే.కేశవ్ రావు, మందా జగన్నాథం, వివేక్ వంటివారనేకమంది చిన్నాపెద్దా నేతలు పార్టీని వీడి ఇతరపార్టీలలో చేరవలసి వచ్చింది. అయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం చలించలేదు. మళ్ళీ ఇప్పుడు సీమాంద్రాలో కూడా అదే పరిస్థితి తలెత్తినా కాంగ్రెస్ అధిష్టానం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. పైగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ సీమాంద్రా యంపీలు రాజీనామాలు చేసుకోవచ్చునని వారికెవరూ అడ్డు చెప్పబోరని పలికి పుండుమీద కారం జల్లినట్లు మాట్లాడారు.

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా పార్టీలో అనేకమంది నేతలు అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుతో తమ ప్రాంతంలో పార్టీ కనబడకుండా పోవడం తధ్యమని హెచ్చరిస్తున్నాఅది చెవిటివాడి ముందు శంఖమే అయ్యింది.

 

దీనర్ధం రాష్ట్ర విభజనను నిలిపివేయమనో, కొనసాగించామనో కాదు. ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు సరికాదని చెప్పడమే. గత రెండు నెలలుగా13జిల్లాలలో ప్రజాజీవనం పూర్తిగా స్తంభించిపోయినా కేంద్ర, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏమాత్రం చొరవ చూపకపోవడం క్షమార్హం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజల పట్ల చూపిస్తున్నఈ ఉదాసీనతకి,నిర్లక్ష్యానికి, వైఫల్యానికి రానున్న ఎన్నికలలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది ప్రజలు చెపుతున్నమాటే కాదు, స్వయంగా కాంగ్రెస్ నేతలే చెపుతున్నారు. ఇప్పటికయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని సమస్య పరిష్కారానికి ప్రయత్నించకపోతే తాము కూర్చొన్న కొమ్మను తామే నరుకొంటున్నట్లుగా భావించవలసి ఉంటుంది.