ఇల్లు ఖాళీ చేసిన చిరు

 

‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో విజయశాంతి చేత ఇల్లు ఖాళీ చేయించే సీన్‌లో చిరంజీవి సూపర్‌గానటించారు. ఇంట్లోంచి సామాను మొత్తం బయటపడేసి విజయశాంతి చేత ఇల్లు ఖాళీ చేయిస్తారు. అయితే పొలిటికల్ లైఫ్‌లో మాత్రం చిరంజీవికి దాదాపు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఢిల్లీలో ఆయన ఇంతకాలం ఖాళీ చేయకుండా వున్న ఇల్లుని ఖాళీ చేయక తప్పలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన తన ఇంటిని ఖాళీ చేశారు. చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు అక్బర్ రోడ్డులోని 17వ నంబర్ ఇల్లు కేటాయించారు. కాలక్రమంలో ఆయనకు మంత్రి పదవి ఇచ్చిన ప్రభుత్వం పోయింది. ఆటోమేటిగ్గా మంత్రిపదవీ పోయింది. అయితే రాజ్యసభ సభ్యత్వం మాత్రం మిగిలి వుంది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఆయనకు రాజ్యసభ సభ్యుడి స్థాయికి చెందిన ఇంటిని కేటాయించి, మినిస్టర్ హోదాలో ఇచ్చిన ఇంటిని ఖాళీ చేయాలని సూచించింది. అయితే తనకు కొత్తగా కేటాయించిన ఇల్లు తనకు నచ్చలేదని చిరంజీవి పాత ఇంటిని ఖాళీ చేయకుండా భీష్మించుకుని కూర్చున్నారు. నిజానికి ఆ ఇంటిని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కి కేటాయించారు. అంచేత ఇల్లు ఖాళీ చేయండి మహప్రభో అని అధికారులు ఎన్ని నోటీసులు ఇచ్చినా చిరంజీవి వాటిని ఎంతమాత్రం పట్టించుకోలేదు. చివరికి అధికారులు ఇల్లు ఖాళీ చేయాల్సిందేనంటూ గేటుకు నోటీసులు అతికించారు. దాంతో తప్పని పరిస్థితుల్లో చిరంజీవి ఇల్లు ఖాళీ చేయడానికి అంగీకరించారు. సదరు ఇంట్లోని సామాను మొత్తం రెండు భారీ ట్రక్కుల్లో హైదరాబాద్‌కి తరలించినట్టు సమాచారం. ప్రభుత్వం ఆయనకి తుగ్లక్ రోడ్డులో ఒక ఇంటిని కేటాయించింది. అయితే సామానును ఆ ఇంటికి కాకుండా హైదరాబాద్‌కి ఎందుకు తరలించారో తెలియరాలేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu