కప్పట్రాళ్ళ హంతకులకు శిక్ష
posted on Dec 10, 2014 11:30AM

కర్నూలు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు కప్పట్రాళ్ళ వెంకటప్ప నాయుడి హత్య కేసులో తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితులుగా వున్న 21 మందికి కర్నూలు జిల్లా ఆదోని సెషన్స్ కోర్టు జీవిత ఖైదును విధిస్తూ తుది తీర్పు ఇచ్చింది. కప్పట్రాళ్ళ హత్య కేసులో మొత్తం 46 మంది నిందితులు ఉన్నారు. వీరిలో నలుగురిని ప్రత్యర్థులు హత్య చేశారు. మరో ముగ్గురు జైల్లో మరణించారు. ఇప్పుడు మిగిలి వున్న నిందితులలో 21 మందిని దోషులుగా నిర్ధారిస్తూ కోర్టు శిక్ష విధించింది. ఈ తీర్పు సందర్భంగా ఆదోని సెషన్స్ కోర్టు ఆవరణ, పరిసరాల్లో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. 2008 మే 17వ తేదీన కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడు, ఆయన సోదరుడి కుమారుడు శివశంకర్ నాయుడుతో పాటు మరో పదిమందిని ఆయన ప్రత్యర్థి వర్గీయులు భారీ సంఖ్యలో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. అప్పటి నుంచి ఈ హత్య కేసు విచారణ జరుగుతోంది. బుధవారం తీర్పు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయోనన్న ఆందోళనలో స్థానికులు ఉన్నారు.