కసిరే ఎండలు కాల్చే కాలం ముందుంది!
posted on Aug 31, 2022 8:12PM
ముందున్నది ముసళ్ల పండుగ అన్నది సామెత.. అయితే ఒక తాజా నివేదిక ప్రకారం ముందున్నది మండుటెండట కాలం. ఇప్పటికే ఏటికేడు ఎండలు మండి పోతుంటే రానున్న కాలంలో రికార్టులన్నిటినీ తిరగరాసే స్థాయిలో భారీ ఉష్ణోగ్రతలు నమోదౌతాయని నిపుణులు చెబుతున్నారు.
రానున్న కాలంలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవ్వడం ఖాయమని కమ్యూనికేషన్స్ ఎర్త్ అండ్ ఎన్విరాన్ మెంట్ జర్నల్ లో ప్రచురితమైన ఒక నివేదిక పేర్కొంది. ఇప్పుడు నమోదవుతున్న ఎండలకే జనం ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటే.. ఇక రానున్న కాలంలో మరింతగా ముదిరే ఎండలకు జనం అల్లల్లాడటం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే రాబోయే కాలంలో దేశంలో ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పెరగబోతున్నాయని చెబుతున్నారు.
ఇండియాలాంటి ఉష్ణ మండల దేశాల్లో రాబోయే దశాబ్దాల్లో ఎండలు గణనీయంగా పెరగబోతున్నట్లు తాజా సర్వే ఒకటి తేల్చింది. ఈ నివేదిక ప్రకారం వాతావరణ మార్పులు, కర్బన ఉద్గారాల కారణంగా ఎండలు విపరీతంగా పెరుగుతాయి. ఏడాదిలో అత్యధిక కాలం 30-50 శాతం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. 2050 వరకు ఉష్ణ మండల దేశాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. ఆసియా, ఉత్తర యూరప్‌లో ప్రమాదకరమైన వడగాడ్పులు కూడా వీస్తాయి.
కర్బన ఉద్గారాల్ని తగ్గించకపోతే ఇదే రీతిలో ఎండలు పెరిగిపోయే ముప్పు ఉందని నివేదిక పేర్కొంది. ఇటువంటి వాతావరణం దీర్ఘకాలిక అరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.