ఓల్డ్ సీటిని గోల్డ్ సిటీగా మార్చాలంటే మూసీ ప్రక్షాళన జరగాల్సిందే : సీఎం రేవంత్
posted on Aug 20, 2025 3:08PM
.webp)
ప్రపంచ స్థాయి నగరంలో ప్రభుత్వ ఆఫీసులు సరిగ్గా లేవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి శంకుస్థాపన కార్యాలయంలో ముఖ్యమంత్రి పాల్గోన్నారు. గచ్చిబౌలిలో 8 నెలల్లో అంతర్జాతీయ స్ధాయి నూతన భవన సముదాయాల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. మూసీ ప్రక్షాళనను కొందరు వ్యతిరేకించిన ఓల్డ్ సీటిని గోల్డ్ సిటీగా మార్చాలంటే మూసీ ప్రక్షాళన జరగాల్సిందేనని తెలిపారు.
ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు హైదరాబాద్‌లో ఉండటం గర్వకారణమని సీఎం అన్నారు. చంద్రబాబు, వైఎస్ఆర్‌లు కూడా హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. ఇక దేశంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి వెనుకు స్వర్గీయ రాజీవ్ గాంధీ పాత్ర కూడా ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే హైటెక్స్ సిటీకి పునాది రాయి పడిందని, ఆ తరువాత దాని నిర్మాణాన్ని చంద్రబాబు కొనసాగించారని రేవంత్ గుర్తు చేశారు.
అమెరికాలో కూడా సిలికాన్ వ్యాలీని తెలుగు వాళ్లు శాసిస్తున్నారని తెలిపారు. తెలుగు వాళ్లు లేకపోతే అమెరికా ఐటీ కంపెనీలు నడిచే పరిస్థితి లేదన్నారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. న్యూయార్క్, టోక్యో, సింగపూర్‌లతో హైదరాబాద్‌కు పోటీగా నిలబెట్టాలని తెలిపారు.
కానీ, మూసీ ప్రక్షాళన.. ఫ్యూచర్ సిటీ కొందరికి నచ్చడం లేదని కామెంట్ చేశారు. ఆనాడు కూడా హైటెక్స్ సిటీని కొందరు అవహేళన చేశారని.. ఔటర్ రింగ్ రోడ్డు ఎందుకు, ఊరు చివర ఎయిర్‌పోర్టా అంటూ కామెంట్లు చేశారని గుర్తు చేశారు.తెలంగాణ రైజింగ్ నినాదంతో హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు పాల్గోన్నారు.