13 గంటలు.. ఎనిమిది భేటీలు.. హస్తినలో లోకేష్ స్పీడ్ మామూలుగా లేదుగా?
posted on Aug 20, 2025 2:08PM
.webp)
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ హస్తిన పర్యటన దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. రాజకీయాలతో సంబంధ్ లేకుండా లోకేష్ హస్తిన పర్యటనను అన్ని పార్టీల నేతలూ ఆసక్తిగా గమనించాయి. నిజానికి లోకేష్ తాజా హస్తిన పర్యటన పూర్తిగా ఫలవంతమైంది. లోకేష్ కోరడం ఆలస్యం కేంద్ర మంత్రులంతా ఆయనకు పోటీలు పడి మరీ అప్పాయింట్ మెంట్లు ఇచ్చారు. కేవలం 13 గంటల వ్యవధిలో ఆయన ఎనిమిది మంది కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. అలాగే ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాథాకృష్ణన్ ను కలిసి అభినందించారు. అంతే కాదు ఈ సారి పర్యటనలో ఆయన హస్తినలో టీడీఎల్పీ కార్యాలయాన్ని సందర్శించారు. టీడీఎల్పీ కార్యాలయానికి లోకేష్ వెళ్లడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా లోకేష్ కు తెలుగుదేశం, జనసేన ఎంపీలు ఘన స్వాగతం పలికారు. సాధారణంగా ఈ స్థాయిలో మంత్రులతో భేటీలు జరపడం, రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం నిర్విరామంగా కృషి చేయడంలో ఇంత వరకూ చంద్రబాబుకు ఎవరూ సాటిరారన్న పేరు ఉంది. అయితే లోకేష్ తాజా హస్తిన పర్యటన ఆయన చంద్రబాబును బీట్ చేసేశారా అనిపించేలా ఉందని ఒక్క తెలుగుదేశం కూటమి నాయకులే కాదు.. పలు జాతీయ పార్టీల అగ్రనేతలు కూడా అంటున్నారు. ఆయన స్పీడ్ ఓ రేంజ్ లో ఉందని ప్రశంసిస్తున్నారు.
ఈ భేటీలలో నారా లోకేష్ రోడ్లు, డేటా సిటీ, పోర్టు అభివృద్ధి గ్రాంట్లు సహా అనేక కీలక అంశాలపై సంబంధిత మంత్రులతో చర్చించారు. దాదాపుగా.. దాదాపుగా ఏమిటి.. ఆయన కలిసిన కేంద్ర మంత్రులంతా లోకేష్ వినతులకు సానుకూలంగా స్పందించారు. ఏపీ అభివృద్ధి విషయంలో సంపూర్ణ సహకారం అందిస్తామంటూ ముందుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర సంతులిత అభివృద్ధికి కేంద్రం సహకారం సాధించడమే ధ్యేయంగా సాగిన లోకేష్ హస్తిన యానం పూర్తిగా ఫలవంతమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.