బాబు ద బిజినెస్ మెన్
posted on Aug 20, 2025 3:28PM
.webp)
రతన్ టాటా ఇన్నోవేటివ్ హబ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రతన్ టాటా చనిపోవచ్చేమోగానీ ఆయన ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లోనూ చనిపోవడం తనకు ఇష్టం లేదన్నారాయన. అందుకే ఈ హబ్ స్థాపించినట్టు చెప్పారు. మన కంటి ముందు హైదరాబాద్‌లో ఐటీ ర్యాలీ తీసింది మనం చూసే ఉంటాం. తాను ఈ విషయం అప్పుడే పసిగట్టి.. ఐటీ ని ఎంకరేజ్ చేశాననీ తర్వాత ఇప్పుడు ఐటీలో మన వాళ్లు మేటిగా ఉన్నట్టు చెప్పారాయన.
ఇప్పుడు అమరావతి అనే రాజధాని నిర్మాణం చేసే అదృష్టం నాకొచ్చింది. దీంతో ఈ ప్రాంతాన్ని క్వాంటం వ్యాలీగా మార్చడమే తన ధ్యేయమన్నారు చంద్రబాబు. అదేమంత పెద్ద కష్టం కాదని.. తానందించిన ప్రేరణతో ఇప్పుడు ఎటు చూసినా తెలుగువారే కనిపిస్తున్నారని.. యూఎస్‌లో పెద్ద స్థాయిలో భారతీయులు రాణిస్తుంటే వారిలో 33 శాతం తెలుగు వారే ఉన్నారని అన్నారాయన.
ఇదే స్ఫూర్తితో తాను అమరావతిని సైతం తీర్చిదిద్దాలని చెప్పుకొచ్చారు. అప్పట్లో ఇంటికో ఐటీ ఎంప్లాయి ఉండాలని భావించిన తాను- ప్రస్తుతం ఇంటికో ఎంటర్ ప్రెన్యూర్ ఉండేలా భావిస్తున్నానని.. అందుకే ఈ రతన్ టాటా హబ్ తీసుకొస్తున్నట్టు చెప్పుకొచ్చారాయన.
అంతే కాదు తన స్వీయ అనుభవాలను కూడా ఈ సందర్భంగా రంగరించారు చంద్రబాబు. 1992లో తాను హెరిటేజ్ ఐడియా తీసుకొచ్చానని.. కారణం మనం ఎప్పుడైతే రాజకీయాల్లాంటి ఐడియల్ ప్లేసెస్ లో ఉన్నామో.. మన కుటుంబానికంటూ ఒక ఆర్ధిక ఆధారం ఉండాలని తాను మొదట భావించినట్టు చెప్పుకొచ్చారాయన.
దీంతో తానీ వ్యాపారం ప్రారంభించామని.. తర్వాత కాలంలో.. దాన్ని నడిపే బాధ్యతను తన సతీమణి భువనేశ్వరికి ఇచ్చాననీ.. తొలుత ఆమె పెద్ద గొప్పగా ముందుకు రాకున్నా.. ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో వండర్స్ క్రియేట్ చేసినట్టు చెప్పారు. ఇప్పుడు తాము తమ కుటుంబం హ్యాపీగా ఉన్నామని. ఈ ప్రేరణతో తాను ఇంటింటికీ ఒక ఎంటర్ ప్రెన్యూర్ ప్రొగ్రాం తీసుకొస్తున్నట్టు చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు.