సీఎం రేవంత్‌తో శాంతి చర్చల కమిటీ నేతలు భేటీ

 

 

సీఎం రేవంత్ రెడ్డితో శాంతి చర్చల కమిటీ నేతలు సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ముఖ్యమంత్రి నివాసంలో వారు భేటీ అయ్యారు.  మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గా ప్రసాద్,  జంపన్న,  రవిచందర్ లు విజ్ఞప్తి చేశారు. మావోయిస్టులపై కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని ముఖ్యమంత్రి ను వారు కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్ కు వినతి పత్రం అందజేశారు శాంతి చర్చల కమిటీ  నేతలు. 

ఈ సందర్బంగా సీఎం రేవంత్ వారితో మాట్లాడుతూ.. ‘నక్సలిజాన్ని మా ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తుంది తప్ప శాంతి భద్రతల అంశంగా పరిగణించదు. గతంలో నక్సలైట్ల తో చర్చలు జరిపిన అనుభవం మాజీ మంత్రి జానారెడ్డికి ఉంది. ఈ అంశంపై సీనియర్ నేత జానారెడ్డి సలహాలు , సూచనలు తీసుకుంటాం. మంత్రులతో చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటాం’ అని తెలిపారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఐదో రోజు కూంబింగ్‌లో భాగంగా మావోయిస్టులకు భారీ షాక్‌ తగిలింది. భద్రతా బలగాల ఆపరేషన్‌లో ఛత్తీస్‌గఢ్‌వైపు భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 38 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు తెలుస్తోంది.