పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్‌లో కలపండి : సీఎం రేవంత్ రెడ్డి
posted on Apr 25, 2025 9:18PM

పాకిస్థాన్‌ను దెబ్బకొట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాద్‌లో శాంతి ర్యాలీ జరిగింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులతో పాటు మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ ర్యాలీలో పాల్గొని ఉగ్రవాద చర్యలను ఖండించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో కలపాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.
1967, 1971లో ఇలాంటి దాడులు జరిగినప్పుడు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గట్టి జవాబు ఇచ్చారని ఆయన తెలిపారు.ఇందిరాగాంధీని వాజ్ పేయి దుర్గామాతతో పోల్చారని ఆయన పేర్కొన్నారు. దుర్గామాత భక్తుడైన ప్రధాని మోదీ ఉగ్రమూకలకు గట్టి జవాబు చెప్పాలని ముఖ్యమంత్రి కోరారు.ఈ శాంతి ప్రదర్శన పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమై ట్యాంక్‌బండ్‌పై ఉన్న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహం వరకు కొనసాగింది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో బాధితులకు సంఘీభావం తెలపాలని, ఉగ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో ఏఐసీసీ ముఖ్య నేతలు సమావేశమై చర్చించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, డివిజన్ కేంద్రాల్లో శాంతియుత నిరసనలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.