ఆ ప్రశంసలు.. దేనికి సంకేతం ?
posted on Jul 25, 2025 5:22PM
.webp)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీకి దూరం పెరిగిందని, ఆయన ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా, అధినాయకుడి అప్పాయింట్మెంట్ దొరకడం లేదని, అదొక అందని ద్రాక్షగా మిగిలిందనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. అందులో ఎంత నిజం వుంది. ఎంత లేదు అనే విషయాన్ని పక్కన పెడితే,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజా ఢిల్లీ యాత్ర, ఏడాది కరవును కడిగేసింది.
తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే పేరిట నిర్వహించిన కులగణన గురించి రేవంత్ రెడ్డి గురువారం (జూలై 24) ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎంపీలకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ప్రశంసల వర్షం కురిపించారు.ఒక్క రాహుల్ గాంధీ కాదు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ ఇతర పార్టీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశంసల్లో ముంచెత్తారు.
అన్నిటినీ మించి, సోనియా గాంధీ, లేఖ ద్వారా అందించిన ప్రశంసలు, రేవంత్ రెడ్డిని ఆనంద డోలికల్లో ముంచెత్తాయి. అందుకే, ఆయన సోనియా రాసిన లేఖను, తనకు దక్కిన జీవిత సాఫల్య పురస్కారంగా,ఆస్కార్ అవార్డుగా, నోబెల్ పురస్కారంగా పేర్కొన్నారు. అంతే కాదు, కుర్చీ ఉన్నా లేకున్నా, ఈ జీవితానికి ఇది చాలు’ అంటూ సంతోషాన్ని వ్యక్త పరిచారు.
అదలా ఉంటే, బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు రాజకీయంగా ఏకమై కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తే దేశవ్యాప్తంగా 60-70 శాతం ప్రజల మద్దతు లభించినట్లేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. అప్పుడే సామాజిక న్యాయం సాధించగలమన్నారు. కులగణనను ప్రధానాంశంగా లేవనెత్తిన ఘనత రాహుల్‌గాంధీకే దక్కుతుందని ప్రశంసించారు.