హైకోర్టుకు కేజ్రీవాల్ చురకలు.. నన్నంటే ఏమోస్తుంది..
posted on Sep 3, 2016 5:06PM

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరోసారి లెఫ్టినెంట్ గవర్నర్ పేరును తెరపైకి తీసుకొచ్చారు. అంతేకాదు ఢిల్లీ హైకోర్టుకు కూడా చురకలు అంటించారు. ఎందుకంటే రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల వల్ల ఢిల్లీలో వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ వరదల భీభత్సం కారణంగా వీధులు జలమై...రహదారులు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో వర్షాల వల్ల దెబ్బతిన్న రహదారులు బాగు చేసి, లోతట్టు ప్రాంతాల ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని హైకోర్టు కేజ్రీవాల్ సర్కారుపై మండిపడింది. ఇక దీనికి కేజ్రీవాల్ తనదైన శైలిలో కోర్టుకు చురకలు అంటించారు. ఒకవైపు పరిపాలనా పరమైన నిర్ణయాల్లో లెఫ్టినెంట్ గవర్నర్‌దే తుది నిర్ణయమని.. లెఫ్టినెంట్ గవర్నరే సమస్తమని చెప్పే కోర్టు.. ఇప్పుడు రాష్ట్రంలో తలెత్తిన లోపాలపై మమ్మల్ని ప్రశ్నిస్తే ఎలా.. వర్షం వల్ల నిలిచిపోయిన నీళ్లు, రహదారుల మరమ్మత్తుపై కూడా లెఫ్టినెంట్ గవర్నర్‌నే ప్రశ్నించాలి అని అన్నారు. మరి కేజ్రీవాల్ వ్యాఖ్యలకు కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.