గండికోట పర్యాటక ప్రాజెక్టుకు ఆగస్టు 1న సీఎం శంకుస్థాపన!
posted on Jul 30, 2025 2:32PM
.webp)
కడప జిల్లాలో రూ. 78 కోట్లతో చేపట్టనున్న ప్రతిష్టాత్మక గండికోట పర్యాటక ప్రాజెక్టుకు వచ్చే నెల 1న శంకుస్థాపన జరగనుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాస్కి పథకం చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆగస్టు1వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. ఈ విషయాన్ని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ బుధవారం తెలిపారు. నిడదవోలులో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఆగస్టు 1వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జమ్మలమడుగులో ఇంటింటికీ సామాజిక పెన్షన్ష పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారనీ, ఆ తరువాత మధ్యాహ్నం గండికోట ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారనీ వివరించారు.
ఏపీటీడీసీ ఆధ్వర్యంలో రాజస్థాన్లోని ఉదయపూర్లో ఔత్సాహిక పెట్టుబడిదారు లను, పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి ఆహ్వానించి పర్యాటకాభివృద్ధికి కృషి చేసే కార్యక్రమంలో భాగంగా ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆ ఎగ్జిబిషన్ ఆగస్టు 3, 4 తేదీలలో ఉంటుందన్నారు. అలాగే నవంబర్ 14, 15తేదీలలో వైజాగ్ లో పార్ట్ నర్ షిప్ సమ్మిట్ నిర్వస్తున్నట్లు తెలిపారు. ఈ భాగస్వామ్య సదస్సు కోసం మంత్రి లోకేష్ చైర్మన్ గా ఆరుగురు మంత్రులతో ఏర్పాటు చేసిన కమిటీలో తానూ సభ్యుడనని కందుల దుర్గేష్ తెలిపారు. ఈ భాగస్వామ్య సదస్సు ద్వారా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లను రాష్ట్రానికి ఆహ్వానించనున్నామన్నారు. ముఖ్యంగా పర్యాటక రంగంలో కొత్త పెట్టుబడులు తీసుకురావడానికి భాగస్వామ్య సదస్సు ఎంతగానో దోహదం చేస్తుందని కందుల తెలిపారు. గతంలో అంటే 2014 నుంచి 2019 వరకూ సీఎం చంద్రబాబునాయుడు హయాంలో విశాఖలో ఏటా పార్ట్ నర్ షిప్ సమ్మిట్ జరిగేదని కందుల రమేష్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.
వైజాగ్ లో జరిగిన అనేక సమ్మిట్ లలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు సీఎం చంద్రబాబునాయుడు సహకారహస్తాన్ని అందుకొని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారన్నారు. గడిచిన ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఏనాడు కూడా పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు ఇచ్చే విధానాన్ని అవలంబించలేదని విమర్శించారు సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు మళ్లీ పార్ట్ నర్ షిప్ సమ్మిట్ లపై దృష్టి పెట్టారని ఈ నేపథ్యంలో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తాయని మంత్రి దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.