తిరుమలలో ముమ్మర తనిఖీలు
posted on May 2, 2025 9:43AM

ఓ వైపు పహల్గాం ఉగ్రదాడి, మరో వైపు ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో అధికారులు అప్రమత్తమయ్యారు. వారాంతం సమీపిస్తుండటంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో భద్రతా పరంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఇంకో వైపు తిరుమలకు వచ్చే వాహనాల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కండీషన్ సరిగా లేని వాహనాలుతిరుమల కొండపైకి వస్తుండటంతో ఘాట్ రోడ్డులో అగ్ని ప్రమాదాల సంఘటనలూ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీవో అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు.
తిరుమల ట్రాఫిక్ పోలీసులతో కలిసి ఆర్టీవో అధికారులు మొబైల్: పొల్యూషన్ వాహనంతో చెకింగ్ చేపట్టారు. తిరుమలకు ప్రత్యేకంగా పొల్యూషన్ చెకింగ్ వాహనం తీసుకవచ్చి తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో గురువారం ఒక్క రోజే దాదాపు 24 వాహనాలు అత్యధిక కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని గుర్తించారు. మరొ కొన్ని వాహనాలకు ఫిట్ నెస్ సరిగా లేదని గుర్తించారు. వాహనాలకు పొల్లూషన్ సర్టిఫికెట్, సరైన ఫిట్నెస్ ఉంటేనే అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.