పెట్టుబడుల స్వర్గధామం ఏపీ

 

పెట్టుబడులకు స్వర్గధామంలా, పెట్టుబడిదారులకు నేస్తంలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వుంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సింగపూర్‌లో శుక్రవారం నాడు దక్షిణాసియా అధ్యయన కేంద్రంలో జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో పాలుపంచుకునే అద్భుత అవకాశాన్ని పొందాలని పిలుపునిచ్చారు. ఏపీ రాజధానిని ప్రపంచంలోనే అత్యంత అద్భుత నగరంగా నిర్మించాలన్న సంకల్పాన్ని పెట్టుకున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెయ్యి కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం, అనేక రకాల ఖనిజ సంపద వున్నాయని. వ్యవసాయపరంగా సంపన్నంగా వుందని, ఇండియాకి మాత్రమే కాకుండా ఆసియాకే రవాణా కేంద్రంగా రూపొందే సత్తా ఏపీకి వుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నగరాలన్నింటినీ నివాసానికి అత్యంత అనువైనవిగా అభివృద్ధి చేయడమే తమ పట్టణాభివృద్ధి విజన్ అని చంద్రబాబు చెప్పారు. ఓడరేవులు, విమానాశ్రయాలు, రహదారి రవాణా సంస్థలన్నింటినీ ప్రపంచ స్థాయికి తెచ్చేందుకు మౌలిక సదుపాయల మిషన్ ఏర్పాటు చేశామని సీఎం చెప్పారు. ఏపీలో విద్యుత్ కొరత అనేదే వుండదని ఈ విషయంలో తాను పూచీ ఇస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కి ఉన్న ఉజ్వలమైన అభివృద్ధి అవకాశాలను చంద్రబాబు నాయుడు సింగపూర్ పారిశ్రామికవేత్తలకు వివరించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu