హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు బృందం
posted on Nov 15, 2014 10:15AM

మూడు రోజుల సింగపూర్ పర్యటనకు వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్‌కి చేరుకుంది. వీరికి ఏపీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, తెలంగాణ టీడీపీ నాయకులు ఎర్రబెల్లి దయాకరరావు, ఎల్.రమణ తదితరులు స్వాగతం పలికారు. సింగపూర్ పర్యటన ఎలా జరిగిందని మీడియా ప్రశ్నించినప్పుడు చంద్రబాబు నాయుడు విక్టరీ సింబల్ చూపడం విశేషం. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి, చంద్రబాబు బృందంలో వున్న కంభంపాటి రామ్మోహన్‌రావు మాట్లాడుతూ, తమ పర్యటన విజయవంతం అయిందని, సింగపూర్‌లో మూడు వందల మంది పారిశ్రామికవేత్తలు తమ బృందంతో మాట్లాడారని చెప్పారు. అక్కడి పారిశ్రామికవేత్తలు పలువురు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోవడానికి జనవరిలో రానున్నారని ఆయన వెల్లడించారు. అలాగే ఈనెల 23 నుంచి 29వ తేదీ వరకు చంద్రబాబు జపాన్‌లో పర్యటించనున్నారని కంభంపాటి తెలిపారు.