ఇండోనేసియాలో భారీ భూకంపం 7.3
posted on Nov 15, 2014 8:33AM

గతంలో సముద్రంలో సంభవించిన భూకంపం కారణంగా వచ్చిన సునామీ అనేక దేశాల్లో సృష్టించిన విధ్వంసాన్ని ఎవరూ మరచిపోలేరు. ఇప్పుడు మరోసారి తూర్పు ఇండోనేసియాలోని మలుకు దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు మీద భూకంప తీవ్రత 7.3గా నమోదైంది. సముద్రంలో 46 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం వున్నట్టు గుర్తించారు. భూకంపం కారణంగా ఇండోనేసియాకు 300 కిలోమీటర్ల పరిధిలో సునామీ వచ్చే అవకాశాలు వున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, జపాన్, తైవాన్, దక్షిణ పసిఫిక్ దీవులకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ భూకంప కేంద్రం భారతదేశానికి చాలా దూరంలో వున్నందున ప్రస్తుతానికి భారత్‌కి సునామీ హెచ్చరికలు లేవని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.