చంద్రబాబు డిల్లీ యాత్ర రాజకీయాలకోసం కాదుట
posted on Sep 21, 2013 1:17PM
.jpg)
చంద్రబాబు శనివారం డిల్లీ చేరుకొన్నారు. తాను ఇప్పుడు రాజకీయాలు మాట్లాడేందుకు రాలేదని ప్రధాని డా.మన్మోహన్ సింగ్ మరియు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలను కలిసి రాష్ట్రంలో పరిస్థితులు వివరించి, వారిని ఈ విషయంలో జోక్యం చేసుకొని పరిస్థితులు చక్కదిద్దవలసిందిగా కోరేందుకే వచ్చానని అన్నారు. ఆయన వెంట పార్టీకి చెందిన సీమాంద్రా, తెలంగాణా నేతలు కూడా వెళ్లి ప్రధానిని, రాష్ట్ర పతిని కలుస్తారు. ఆ తరువాత వారు డిల్లీలో ప్రతిపక్ష జాతీయ నేతలను కలిసిరాష్ట్రంలో పరిస్థితులు వారికీ వివరించి, పరిస్థితి చక్కదిద్దమని ప్రభుత్వంపై ఒత్తిడి తేవలసిందిగా వారిని కోరనున్నారు.
ఇక పనిలోపనిగా బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా మోడీని ఎంపిక చేసినందుకు శుభాకాంక్షలు తెలిపే మిషతో బీజేపీ అగ్రనేతలను కూడా కలిసి రెండు పార్టీల మధ్య పొత్తులకు మార్గం సుగమం చేయవచ్చును. ఒకవేళ ఈవిషయమై రెండు పార్టీల మధ్య అవగాహన ఏర్పడినప్పటికీ ఇప్పటికిప్పుడు అంతిమ నిర్ణయం తీసుకొనే అవకాశం లేదు. ఎందుకంటే దాని వలన రెండు పార్టీలకు లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. తెదేపా, బీజేపీలు చేతులు కలుపుతున్నట్లు గ్రహిస్తే వెంటనే కాంగ్రెస్, వైకాపాలు తదనుగుణంగా తమ వ్యూహాలు మార్చుకొనే అవకాశం ఉంటుంది.
ఇక ఇప్పటికే తెలుగు తమ్ముళ్ళు ఈడీ మరియు విజిలన్స్ అధికారులని కలిసి జగన్ వ్యవహారం గుర్తు చేసి వచ్చారు గనుక చంద్రబాబు మళ్ళీ ఆ ప్రయత్నం చేయకపోవచ్చును. కానీ జగన్ బెయిలు పిటిషనుపై సీబీఐ కోర్టు తన తీర్పును సోమవారం నాడు వెలువరించనున్నఈ సమయంలో చంద్రబాబు డిల్లీలో మఖాం వేయడంతో వైకాపా మళ్ళీ ఆయనపై ఆరోపణలు గుప్పిస్తోంది.