పెళ్లికి పోదాం చలో చలో... 

పెళ్లి అనేది భారతీయుల సాంప్రదాయంలో పండుగ కంటే ఎక్కువ. వధూవరుల చూపులు మనసులు కలిసి, పెద్దల మాటలు ఒక్కటవ్వగానే మొదలయ్యే హడావిడి, బంగారం, చీరలు, బట్టలు షాపింగ్, పెళ్ళిపత్రికల ఎంపిక, కళ్యాణ మండపాల బుకింగ్, వంటల మెనూ ఇలా బోలెడు విషయాల నుండి ఎవరిని పిలవాలి, ఎంతమందికి గదులు బుక్ చేయాలి వంటివి వాటితో కలిపి పెద్ద తతంగమే ఉంది మనకు.అయితే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కుటుంబాలకి మాత్రమే కాకుండా కాసింత దగ్గరి బంధువులకు కూడా తప్పదు ఈ హడావిడి. మిరుమిట్లు గొలిపే కల్యాణ మండపాల్లో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుల శోభకు ఏమాత్రం తగ్గకుండా జిగేలు మని మెరావడానికి పోటీ పడే మగువలు, మగరాయుళ్లకు తక్కువేమీ లేదు. కానీ వాటికోసం షాపింగ్ అవి ఇవీ కాస్త విసుగు తెప్పిస్తాయి, విసుగుతో పాటు జేబులు  కూడా కొల్లగొడతాయి. అలాంటిదేమి లేకుండా హాయిగా పెళ్లికి వెళ్లి రావడానికి కొన్ని చిట్కాలు.

షాపింగ్ గోల తప్పించుకోండి ఇలా…

సాదారణంగా చాలామంది చేసేపని పండుగ ముందో లేదా పెళ్లిళ్లు, శుభకార్యాల ముందో షాపింగ్ చేయడం. దీనివల్ల ఏదో హడావిడి చుట్టుముడుతుంది. కాబట్టి సింపుల్ గా డబ్బులు దగ్గరున్నపుడు, ఎక్కడైనా దూరప్రాంతాలకు టూర్ లకు వెళ్ళినపుడు అక్కడ ప్రముఖ  షాప్ లలోనో, లేదా ప్రత్యేకంగా పరిగణించబడే దుస్తులో, లేదా జ్యువెలరీనో కొనుక్కోవచ్చు. దానివల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఫలానా చోట కొన్నాం అని చెప్పుకుంటే వచ్చే కిక్కు ఒకటైతే, అందరిలోనూ కాసింత ప్రత్యేకత మరియు మీరు చేసిన ప్రయాణం తాలూకూ మంచి గుర్తులుగా మీ షాపింగ్ ఎప్పటికీ మర్చిపోలేనంతగా తీపి జ్ఞాపకాలను మిగులుస్తుంది. అంతే కాదు పెళ్లిళ్ల ముందు తొందర తొందర అని తరిమే పెద్దవాళ్ళ మాటల్లో బట్టల ఎంపికలో బొక్కబోర్లా పడకుండా వేరే పనులు చూసుకునే అవకాశం లభిస్తుంది.

జ్యువెలరీ జుయ్ జుయ్!!

ఇప్పట్లో జ్యువెలరీ అంటే అందరూ బంగారమే పెట్టేస్తున్నారా ఏమన్నా?? గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ ఎక్కడ చూసినా లక్షణంగా దొరుకుతుంది. అది కూడా తక్కువ ధరలోనే. ఎక్కడికైనా వెళ్ళినపుడు రంగురంగుల రాళ్లతో పొదిగిన జ్యువెలరీ తీసుకోవడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. అలాగే అల్ టైమ్ ఫెవరేట్ గా అందరిలో నిలబెట్టేవి ముత్యాలు. ఇవి కూడా ధరలను బట్టి దొరుకుతాయి. అపుడపుడు ముత్యాల చెవిదిద్దులు, మెడ హారం, గాజులు వంటివి తీసుకుని భద్రపరచుకుంటే పెళ్లిళ్ల కోసం ప్రత్యేకంగా ఖర్చు పెట్టనవసరం లేదు.

ప్యాకింగ్ పారాహుషార్!!

పెళ్లికి వెళ్తున్నాం అంటే అందరి బట్టలు సర్దడం పెద్ద చిరాకు. అలా కాకుండా సింపుల్ గా జరిగిపోవాలి అంటే, పెళ్లికి వెళ్తున్నన్ని  రోజులు ఏ రోజు ఏ దుస్తులు వేసుకోవాలి, ఏ వస్తువులు కావాలి వంటివి ఎవరికి వారు నిర్ణయించుకుని, ఎవరి బ్యాగ్ వాళ్ళు సర్దుకోవడం ఉత్తమం. దీనివల్ల పెళ్లింట్లో నేను అది చెప్పాను, నువ్ అది పెట్టలేదు, ఇది పెట్టలేదు లాంటి గోల తప్పుతుంది. 

కిట్ తో షార్ట్ కట్!!

అందరూ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బ్రష్ లు, పేస్ట్ లు, సోప్ లు, షాంపూ లు, దువ్వెనలు ఇలా అందరివి ఒక కిట్ సెపరేట్ గా ఉంచుకుంటే వాటిని మర్చిపోవడం మధ్యలో కొనడం వంటి అదనపు పనులు తగ్గుతాయి. నిజానికి పెళ్లి అనే కాదు చాలా ప్రయాణాల్లో చాలామంది మర్చిపోయేవి ఇవే.
ఇట్లా అన్నీ ఒక ప్రణాళికతో సాగిపోతే పెళ్లికి పోవడం పెద్ద హంగామాలా కాకుండా సింపుల్గా వెళ్లి వచ్చేయచ్చు. పెళ్లిని ఎంతో చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. 

◆ వెంకటేష్ పువ్వాడ