రాష్ట్ర ప్రభుత్వాల ఆటలకు కేంద్రం అడ్డుకట్ట..
posted on May 26, 2016 12:39PM

ఇకపై ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ విభాగాల్లో పనిచేసే అధికారుల విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు కేంద్రం అడ్డుకట్ట వేసినట్టు తెలుస్తోంది. తమ మాట వినని అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించే తీరు.. వారిని బదిలీలు, సస్పెన్షన్లు అంటూ వేధిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక నుండి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ విభాగాల్లోని అధికారులను సస్పెండ్ చేయాల్సి వస్తే, రాష్ట్ర ప్రభుత్వం గరిష్ఠంగా నెల రోజుల పాటు మాత్రమే విధుల నుంచి పక్కన పెట్టగలుగుతుంది. అది కూడా సస్పెండ్ చేసిన 48 గంటల్లోగా కేంద్రానికి తెలియజేయాల్సి వుంటుంది. ఇక కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తున్న అధికారులను సస్పెండ్ చేయాల్సి వస్తే, ప్రధాని అనుమతి తప్పనిసరి. ఈ మేరకు రాష్ట్రాల అధికారాలకు కోత విధిస్తూ, కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.