టెక్స్ టైల్ పార్క్ మూత.. కేంద్రం, రాష్ట్రాలదే బాధ్యత!

తెలంగాణ రాష్ట్రంలో  నేతన్నలకు మహర్దశ అంటూ ఊదరగొట్టిన టీఆర్ఎస్ సర్కార్.. అదే సిరిసిల్లలోని టెక్స్ టైల్ పార్క్ మూతపడి 2వేల  మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడితే కేంద్రం పన్నే కారణమంటూ సణుగుతోంది తప్ప.. వాస్తవంలోనికి వచ్చి టెక్స్ పార్క్ యాజమాన్యాల సమస్యల పరిష్కారంపై నోరు మెదపడం లేదు.

ప్రపంచ కార్మికుల దినోత్సవం అయిన మేడే నాడే నేత కార్మికుల ఉపాధికి గండి పడింది. సరిగ్గా మే 1వ తారీకునే..అంటే ఆదివారం నాడే సిరిసిట్ల జిల్లా బద్దెనపల్లిలోని టెక్స్ టైల్ పార్కుకు యాజమాన్యాలు తాళం వేశాయి. పరిశ్రమను నడపడం మా వల్ల కాదంటూ చేతులెత్తేశాయి. దీంతో ఆ పార్క్ లో పని చేసే దాదాపు రెండు వేల మంది నేత కార్మికుల బతుకులు అగమ్యగోచరంగా మారిపోయాయి. 
 టెక్స్ టైల్ పార్క్ మూతకు విద్యుత్ రీయింబర్స్ మెంట్ బకాయిలు సకాలంలో రాకపోవడమే ప్రధాన కారణంగా యాజమాన్యాలు చెబుతున్నాయి.

ఏడు కోట్లు వెచ్చించి 75 ఎకరాల్లోఎకరాల్లో  2004లో  టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేశారు.   టెక్స్‌టైల్‌పార్క్‌లో పరిశ్రమలను నెలకొల్పితే సబ్సిడీలు, విద్యుత్తు రాయితీలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ప్రభుత్వం  హామీ ఇవ్వడంతో పలువురు పారిశ్రామికులు ముందుకొచ్చి టెక్స్‌టైల్‌పార్క్‌లో పరిశ్రమలు స్థాపించారు.  165 ఇండస్ట్రీయల్ యూనిట్లు, 27 కమర్షియల్‌ యూనిట్లు  ఏర్పాటయ్యాయి. వీటిలో 115 యూనిట్లలో 1,475 ఆధునిక రాపియర్‌ మరమగ్గాలను ఏర్పాటు చేశారు.

అయితే వాగ్దానం చేసినట్లుగా ప్రభుత్వం నుంచి ఆర్డర్లు రాకపోవడం, అలాగే ప్రైవేటు ఆర్డర్లూ లేకపోవడంతో యాజమాన్యాలకు పరిశ్రమల నిర్వహణ భారంగా మారింది. కరోనా విజృంభించిన సమయంలో మార్కెట్లు పూర్తిగా స్తంభించిపోవడం, దానికి తోడు నూలు ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో పరిశ్రమలు నష్టాల బాట పట్టాయి. అలాగే పరిశ్రమను ఏదో మేరకు ఆదుకుంటూ వస్తున్న బతుకమ్మ ఆర్డర్లు కూడా ఈ ఏడు భారీగా తగ్గిపోవడం పరిశ్రమల నిర్వహణను కష్టసాధ్యంగా మార్చింది.

అన్నిటికీ మించి ప్రభుత్వ హామీ మేరకు మౌలిక సదుపాయాలు, విద్యుత్ రాయితీలూ కూడా అందకపోవడం పార్క్ లో పరిశ్రమల మనుగడను భారంగా మార్చేశాయి.  2015 నుంచి పేరుకుపోయిన విద్యుత్ బకాయిలను విడుదల చేస్తామన్న మంత్రి కేటీఆర్ హామీ కూడా నెరవేరలేదు.  ఈ పరిస్థితుల్లో పరిశ్రమల నిర్వహణ తమ వల్ల కాదంటూ, ప్రభుత్వ హామీలను నెరవేర్చి విద్యుత్ రీయింబర్స్ మంట్ బకాయిలు చెల్లించడమే కాకుండా.. ప్రభుత్వ హామీ మేరకు ఆర్డర్లు కూడా వచ్చేలా చేయాలని పరిశ్రమల యాజమాన్యాలు కోరుతున్నాయి. 

వాస్తవ పరిస్థితి ఇలా ఉండగా చేనేతలను ఆదుకునే విషయంలో మేం చాంపియన్లం అంటే మేం చాంపియన్లమన తెలంగాణలో ఉన్న తెరాస, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజకీయ విమర్శలలో మునిగి తేలుతున్నాయి. ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వం కేటాయించని స్థాయిలో తమ సర్కార్ చేనేతకు బడ్జెట్ కేటాయించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు సత్యనారాయణ, అది ఆయన అజ్ణాజానికి పరాకాష్ట, అసలు చేనేతపై పన్ను వేసిన తొలి సర్కార్ మోడీదే అంటూ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పరస్పర విమర్శల పర్వానికి తెర లేపారు. వాస్తవానికి నేతల సంక్షేమంపై, చేనేత పరిశ్రమ అభివృద్ధిపై ప్రభుత్వాల చిత్తశుద్ధి లేమికి సిరిసిల్ల టెక్స్ టైల్ పార్క్ మూతపడటం నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu