పీకే కొత్త పార్టీ.. ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా
posted on May 2, 2022 11:28AM
ప్రజల పక్షాన విధివిధానాలను రూపొందించేందుకు, అర్థవంతమైన ప్రజాస్వామ్యం కోసం పనిచేసేందుకు 10 ఏళ్లుగా ఒడుదొడుకుల ప్రయాణం చేశాను. ఇప్పుడు ఈ ప్రయాణంలో కొత్త పేజీ తిప్పుతున్నాను. నిజమైన మాస్టర్లయిన ప్రజల సమస్యలను మరింత అర్థం చేసుకునేలా వారి వద్దకు నేరుగా వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఈ ప్రయాణాన్ని బిహార్ నుంచి ఆరంభిస్తాను.
పీకే ట్వీట్
మూడు నాలుగు ఫ్రంట్ లతో లాభం లేదు రెండో ఫ్రంటే ముద్దు అంటూ చెప్పుకొచ్చిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే..ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టాలన్న నిర్ణయానికి వచ్చేశారు. బీజేపీని అధికారం నుంచి దూరం చేయడానికి బీజేపీయేతర పార్టీల ఐక్యతకు చేసిన ప్రయత్నాలు ఫలితాన్నివ్వలేదన్న కారణంగానే ఆయన సొంతంగా పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారన్న అనుమానాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
.webp)
అయినా ప్రశాంత్ కిశోర్ సొంతంగా రాజకీయ పార్టీ స్థాపించాలన్న నిర్ణయం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. ఎందుకంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి తన పాత్ర రాజకీయ వ్యూహకర్తగా కాకుండా రాజకీయ నాయకుడిగానే ఉంటుందని ఇప్పటికే ఆయన ప్రకటించిన సంగతి విదితమే. మూడు నాలుగు రోజుల కిందట రాజకీయ నాయకుడి పాత్ర గురించి చెప్పిన ప్రశాంత్ కిశోర్ అంతలోనే కొత్త రాజకీయ పార్టీ ప్రకటన చేశారు. ఈ రోజు ఉదయమే కొత్త పార్టీపై ప్రకటించిన ప్రశాంత్ కిశోర్, తన సొంత రాష్ట్రమైన బీహార్ నుంచే పార్టీ ప్రరంభిస్తానని స్పష్టం చేశారు. గతంలో ప్రశాంత్ కిశోర్ నతీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యూలో చేరారు. కొద్ది కాలానికి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆ తరువాత ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరే యత్నాలు చేశారు. అయితే అవి ఫలించక స్వయంగా సోనియా గాంధీ ఆహ్వానాన్ని కూడా తిరస్కరించి కాంగ్రెస్ కు కావలసింది తాను కాదనీ, సమర్ధ నాయకత్వమని చెప్పారు.