అన్ని పార్టీల్లోనూ అసమ్మతి.. ఎన్నికల్లో ఏమిటి పరిస్థితి!
posted on May 2, 2022 12:54PM
తెలంగాణలో రాజకీయ పార్టీల వ్యూహాలకు, ఎన్నికల ప్రణాళికలకు ఆయా పార్టీలోని అసంతృప్తి వాదులు, అసమ్మతి వాదులే పెద్ద అవరోధంగా తయారయ్యారు.
రానున్న ఎన్నికలలో అన్ని పార్టీలూ రెబల్స్ బెదడను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సిద్ధమైపోతున్న పరిస్థితి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అధికార తెరాస, రాష్ట్రంలో బలోపేతమై తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదిగామని చెప్పుకుంటున్న బీజేపీ, రాష్ట్రంలో పునర్వైభవం సంతరించుకోవడానికి శతధా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ఇలా మూడు పార్టీలలోనూ అసమ్మతి సెగలు రగులుతున్నాయి.
రాష్ట్రంలో మూడో సారి అధికారం చేజిక్కించుకోవాలనుకుంటున్న టీఆర్ఎస్ లో అసమ్మతి రాగాలు ఒకింత ఎక్కవగానే ఉన్నాయని చెప్పాలి. 2018 ఎన్నికల అనంతరం ఇరత పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు తలుపులు బార్లా తెరిచి తెరాస గూటిలో చేర్చుకోవడమే ఇప్పుడు ఆ పార్టీకి అసమ్మతి బెడద ఎక్కువగా ఉండటానికి కారణం. సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. మొదటి నుంచీ పార్టీలో ఉండి గత ఎన్నికలలో పరాజయం అయిన వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇలా తెరాసలో అసమ్మతి బెడద ఉన్న నియోజకవర్గాలు పదిహేనుకు పైగానే ఉన్నాయంటున్నారు పరిశీలకులు. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారితో రానున్న ఎన్నికలలో తలనొప్పులు తప్పవని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు.
ఇక రాష్ట్రంలో తెరాసకు దీటుగా బలోపేతం అయ్యామని చెప్పుకుంటున్న బీజేపీకి కూడా అసమ్మతి తలపోటులు తప్పడం లేదు. అభ్యర్థుల ఎంపిక సమయానికి ఈ బెడద మరింత ఎక్కువ అయ్యేలా ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. స్వయంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన సొంత నియోజకవర్గంలో అసమ్మతి బెడద ఎదుర్కొంటున్నారు. అలాగే బండి సంజయ్ తీరుతో ఆయన త్రిబుల్ ఆర్ గా అభివర్ణించిన ఈటల రాజేందర్, రఘునందనరావు, రాజాసింగ్ లే అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాల నుంచే సమాచారం అందుతోంది.
ఇక రాష్ట్రంలో పునర్వైభవం సంతరించుకునేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ లో అసమ్మతి మరింత అధికంగా ఉంది. స్వయంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డే సీనియర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. అయినా కాంగ్రెస్ లో అసమ్మతి, అసంతృప్తి, తిరుగుబాట్ల బెడద లేకపోతే ఆశ్చర్యపోవాలి కానీ ఉన్నందుకు కాదు.