చంద్రబాబు చేతుల మీదుగా డీఎస్సీ అభ్యర్థులకు నియామకపత్రాలు
posted on Sep 25, 2025 10:58AM

మెగా డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు గురువారం (సెప్టెంబర్ 25) ప్రభుత్వం నియామక పత్రాలను అందజేయనున్నది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేతుల మీదుగా అభ్యర్థులు నియామక పత్రాలను అందుకోనున్నారు. ఇందు కోసం అమరావతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. వాస్తవానికి డీఎస్సీ లో ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 19న నియామక పత్రాలు అందజేయాల్సి ఉండగా ప్రతికూల వాతావరణం కారణంగా వాయిదా పడింది.
సరే.. ఇప్పుడు గురువారం (సెప్టెంబర్ 25) సీఎం డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ నియామకపత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహా పలువురు మంత్రులు పాల్గొంటారు. డీఎస్సీలో టీచర్ ఉద్యోగాలు దక్కించుకున్న 15,941 మందికి నియామక పత్రాలు అందజేస్తారు. సభలో జిల్లాల వారీగా ప్రజా ప్రతినిధులు కూర్చునేలా సీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 22 మందికి నియామకపత్రాలను స్వయంగా అందజేస్తారు. మిగిలిన వారికి అధికారులు అందజేస్తారు.