టీచర్ కాబోయి పొలిటీషియన్ అయిన చంద్రబాబు?
posted on Sep 6, 2025 11:38AM

కూటమి ప్రభుత్వం శుక్రవారంసెప్టెంబర్ 5న గురుపూజోత్సవం నిర్వహించింది. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ గురించి మాట్లాడిన చంద్రబాబు ఆయన మా జిల్లాలోని రేణిగుంట స్కూల్లో పని చేసినట్టు విన్నానని అన్నారు. ఆపై ఏయూకి వైస్ ఛాన్స్ లర్ గా ఆపై ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతిగా సేవలందించారని అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
ఇక పనిలో పనిగా తన కుమారుడు లోకేష్ చదువు సంధ్యలు ఎలా సాగాయో కూడా చెప్పుకొచ్చారు చంద్రబాబు. తన కుమారుడు మొదట ఎలా ఉండేవారు. ఇప్పుడు ఎలా ఉన్నారన్న కామెంట్ చేశారు. మాములుగా అయితే రాజకీయ నాయకుల పిల్లలు పెద్దగా చదవక పోయేవారని.. కానీ లోకేష్ అలాక్కాదు.. బుద్ధిగా చదువుకుని.. స్టాన్ ఫోర్డ్ స్థాయికి మెరిట్ ద్వారా వెళ్లారు. అక్కడి నుంచి వరల్డ్ బ్యాంక్, సింగపూర్ సీఎం ఆఫీస్ వంటి చోట్ల పని చేసే రేంజ్ కి ఎదిగారు. ఇదంతా ఆయన స్వయం కృషి. లోకేష్ ని ఈ విధంగా తీర్చిదిద్దడంలో ఆయన తల్లి భువనేశ్వరి పాత్ర ఎంతో ముఖ్యమైనదని అన్నారు సీఎం చంద్రబాబు.
సరిగ్గా అదే సమయంలో తాను లెక్చరర్ కావల్సిందని అన్నారు. తన వర్శిటీలో ఈ దిశగా వైస్ చాన్సలర్ అడిగారని, అయితే తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టు చెప్పానని అన్నారు. ఆయన తనను గెలుస్తావా? అని కూడా అడిగారని.. గెలిచి వచ్చి మీతో మాట్లాడతానని తాను అన్నాననీ.. అలా తాను ఎమ్మెల్యేగా గెలవడం మాత్రమే కాదు మంత్రి ఆపై ముఖ్యమంత్రి కాగలిగాననీ.. లేకుంటే ఈ పాటికి మీలాగ నేను కూడా ఒక టీచర్నయి ఉండేవాడ్నని గతాన్ని గుర్తు చేసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు.