నిలువెత్తు నిఘంటువు చంద్రబాబు.. కేంద్ర మంత్రి పెమ్మసాని
posted on Apr 21, 2025 7:04AM
.webp)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కేంద్ర మంత్రి పెమ్మసాని నిలువెత్తు నిఘంటువుగా అభివర్ణించారు. . చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఆయన ప్రసంగాలతో కూడిన పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం ఏపీ అసెంబ్లీ హాల్ లో ఆదివారం (ఏప్రిల్ 20)జరిగింది. ఆ సందర్భంగా పెమ్మసాని ప్రసంగిస్తూ.. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించడానికి వెళ్లేన ఎందరో తెలుగు విద్యార్థులకు చంద్రబాబు అండగా నిలిచారనీ, వారి ఫీజులు చెల్లించి ఆదుకున్నారనీ చెప్పారు.
అయితే చంద్రబాబు చేసిన ఈ సహాయం గురించి ఒకరిద్దరు వినా మరెవరికీ తెలియదన్నారు. చంద్రబాబు కేవలం రాజకీయ నాయకుడే కాదనీ, ఎందరో విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన మార్గదర్శి అన్న పెమ్మసాని, అమెరికాలో చదువుకోవాలనే ఆశతో వచ్చి, ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిస్తే చంద్రబాబు వెంటనే స్పందించేవారని తెలిపారు.ఆయన సేవా దృక్పథానికి, విద్యార్థుల పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనమని అన్నారు.
చంద్రబాబును 'నిలువెత్తు నిఘంటువు'గా అభివర్ణించిన పెమ్మసాని, ఆయన నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, ముఖ్యంగా అమెరికాలో స్థిరపడే సమయంలో ఆ స్ఫూర్తి ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు. అమరావతి వంటి బృహత్తర ప్రాజెక్టును చేపట్టాలనే సంకల్పం, శ్రమదానం, జన్మభూమి వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం వంటివి ఆయన దార్శనికతకు నిదర్శనాలని కొనియాడారు. అమరావతి
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వెడల్పు విషయంలో చంద్రబాబు దూరదృష్టిని పెమ్మసాని ప్రస్తావిస్తూ.. కేంద్రం 70 మీటర్ల వెడల్పుకు అనుమతిస్తే, భవిష్యత్ అవసరాల దృష్ట్యా దాన్ని 140 మీటర్లకు పెంచాలని చంద్రబాబు పట్టుబట్టారని, ఇందుకోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో అర్ధరాత్రి ఒంటిగంటకు సమావేశమై చర్చించి, ఒప్పించారని గుర్తు చేశారు. ఆయన దార్శనికత, పట్టుదల తనను ఎంతగానో ప్రభావితం చేశాయని పెమ్మసాని చెప్పారు.