షర్మిల తాకారంటూ అమరవీరుల స్థూపానికి పాలాభిషేకంతో శుద్ధి

 రాజకీయ విభేదాలు శత్రుపూరిత వైరుధ్యాలకు దారి తీస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైఎస్సార్టీపీ అధినేత్రి ఇటీవలి కాలంలో చాలా దూకుడుగా తెరాసపై విమర్శల దూకుడు పెంచారు. వరంగల్ జిల్లా నర్సంపేట ఘటన అనంతరం షర్మిల ప్రగతి భవన్ ముట్టిడికి వెళుతున్న సందర్బంగా ఆమెను అరెస్టు చేయడం... వాహనంలో ఆమె ఉండగానే టోయింగ్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించడం వంటి ఘటనల తరువాత తెరాస, వైఎస్సార్టీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది.

ఈ వరుస సంఘటనలు జరగడానికి ముందు వరకూ తెరాసపై షర్మిల తెరాస అగ్రనేత సహా నాయకులపై విమర్శలతో మూడు వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారు. ఎప్పుడూ ఎక్కడా తెరాస నుంచి ప్రతిఘటన రాలేదు. ఆమె విమర్శలను దీవెనగా తీసుకుంటున్నారా అన్నట్లుగా తెరాస వ్యవహార తీరు ఉంటూ వచ్చింది. మరి హఠాత్తుగా పరిస్థితిలో ఎందుకు మారింది అన్నదానికి పరిశీలకులు పలు విధాల విశ్లేషణలు చేస్తున్నారు అది వేరే సంగతి. ఇక తెరాస, వైఎస్సాటీపీ అధినేత్రి మధ్య ప్రత్యర్థి అన్న సరిహద్దు చెరిగిపోయింది. శత్రువైరుధ్యంగా మారిపోయింది.

ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ గన్ పార్క్ లోని  అమరవీరుల స్ఫూపాన్ని షర్మిల తాకారంటూ టీఆర్ఎస్ ఓయూ విద్యార్థి సంఘం ఆ స్ఫూపాన్ని పశుపుతో శుద్ధి చేసి పాలాభిషేకం చేశారు. షర్మిల తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికున్నంత కాలం తెలంగాణ రాకుండా అడ్డుకున్నారనీ, ఇప్పుడు ఆయన కుమార్తె షర్మిల తెలంగాణలో కుట్రలు చేస్తున్నారనీ విద్యార్థి సంఘం నాయకులు ఆరోపించారు.