బ్రెడ్, బిస్కెట్లు తింటున్నారా..అయితే..!

బ్రెడ్, బన్నులు, బిస్కెట్లు, పిజ్జా ..ఇలాంటివి తింటున్నారా? అయితే జర భద్రం..అవి తినేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి తినమంటున్నారు శాస్త్రవేత్తలు. వీటిని తయారు చేయడానికి ఉపయోగించే కొన్ని రకాల రసాయనాలు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని..వాటి వల్ల మనుషులకు కేన్సర్ వచ్చే అవకాశముందని నిపుణుల పరిశోధనలో తేలింది.

 

ఢిల్లీలోని వివిధ బేకరీల నుంచి సేకరించిన బ్రెడ్ సహా ఇతర బేకరీ ఉత్పత్తుల శాంపిళ్లలో 84% పొటాషియం బ్రోమేట్, పొటాషియం లోడేట్ లాంటి రసాయన అవశేషాలున్నాయని తేలింది. దీని వల్ల కడుపునొప్పి, డయేరియా, వాంతులు, చెముడు, వెర్టిగో, హైపోటెన్షన్, డిప్రెషన్..ఇలా రకరకాల సమస్యలు వస్తాయని పరిశోధకులు తేల్చారు. దీంతో పొటాషియం బ్రోమేట్‌ను చాలా దేశాల్లో నిషేధించారు. మానవ శరీరంపై ఇంతలా దుష్ప్రభావం చూపిస్తున్న పొటాషియం బ్రోమేట్, పొటాషియం ఆయోడేట్‌ను భారత్‌లో మాత్రం అనుమతిస్తున్నారు. ఇప్పటికైనా ఎఫ్ఎస్ఎస్ఏఐ దీని వినియోగంపై చర్యలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు కోరుతున్నారు.