అమ్మ ప్రమాణ స్వీకారంలో స్టాలిన్‌కు అవమానం..!

తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకే వైరం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వేదిక ఏదైనా సరే ఈ రెండు పార్టీల నేతలు ఎదురుపడితే విమర్శలు, ప్రతి విమర్శలు అవసరమైతే కొట్టుకోవడానికి కూడా వీరు వెనుకాడరు. తాజాగా ప్రజాతీర్పుతో వరుసగా రెండోసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా జయ, తన ప్రత్యర్థి డీఎంకే అధినేత కరుణానిధికి ఆహ్వానం పంపారు.
 

ఆ ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి కరుణ కుమారుడు, మాజీ ఉపముఖ్యమంత్రి స్టాలిన్ హాజరయ్యారు. అయితే ఇక్కడ స్టాలిన్‌కు ఘోర అవమానం జరిగింది. ఆయనకు ఆడిటోరియంలో 16వ వరుసలో కుర్చీ కేటాయించారు. ఆయనతో పాటు మరికొందరు డీఎంకే ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. స్టాలినే ఈసారి ప్రధాన ప్రతిపక్ష నేత అవుతారని ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్షనేత హోదా అంటే కేబినెట్ ర్యాంక్‌తో సమానం. అలాంటి వ్యక్తిని ఇలా వెనుక కూర్చోబెట్టడం ఏంటని డీఎంకే నేతలు మండిపడుతున్నారు. ఇదే కార్యక్రమంలో సినీనటుడు శరత్‌కుమార్‌కు మాత్రం ముందు వరుసలో సీటు ఇచ్చారు.  జయ ఉద్దేశ్యపూర్వకంగానే ఇలా చేసిందని డీఎంకే అధినేత కరుణానిధి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.