చంద్రబాబు మీద బాంబు వేస్తా.. వైసీపీ లీడ‌ర్ బ‌రితెగింపు.. కుప్పంలో హైటెన్ష‌న్‌

ఇప్ప‌టికే ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యాల‌యాల‌పై వైసీపీ మూక‌లు దాడులు చేశారు. ప‌లువురు టీడీపీ నాయ‌కుల‌పై కేసులు బ‌నాయించి జైలుకు త‌ర‌లించారు. ఇక మంత్రుల బెదిరంపుల‌కైతే హ‌ద్దే లేదు. చేసింది చాల‌ద‌న్న‌ట్టు.. కొంత‌మంది వైసీపీ నాయ‌కులు మ‌రీ ఓవ‌ర్‌గా మాట్లాడుతున్నారు. ఏకంగా చంద్ర‌బాబు నాయుడినే అంతం చేస్తామంటూ బెదిరింపుల‌కు దిగుతున్నారు. జ‌గ‌న్‌రెడ్డి ఇలాంటి వ్యాఖ్య‌ల‌ను, నాయ‌కుల‌ను ఎంక‌రేజ్ చేస్తుండ‌టంతో.. మంత్రుల నుంచి చోటామోటా లీడ‌ర్ల వ‌ర‌కూ అంతా నోటికొచ్చిన‌ట్టు వాగుతున్నారు. 

తాజాగా.. చిత్తూరు జిల్లాలో వైసీపీ చేపట్టిన జనాగ్రహ దీక్షలో చంద్రబాబుపై ఓ నేత రెచ్చిపోయి తీవ్ర పదజాలం వాడారు. ‘చంద్రబాబూ.. కుప్పం వస్తే కారు మీద బాంబు వేస్తా.. దమ్ముంటే కుప్పంకి రా రా..’ అంటూ బ‌రితెగింపు మాట‌లు మాట్లాడారు. ఇలా వాగింది ఏ సాదాసీదా చిల్ల‌ర నాయ‌కుడో కాదు. ఆయ‌న బాధ్యతాయుత పదవిలో ఉన్న రెస్కో చైర్మన్‌ జీఎస్‌ సెంథిల్‌కుమార్‌. 

కుప్పంకు వ‌స్తే చంద్ర‌బాబు కారు మీద బాంబులేస్తానంటూ సెంథిల్‌కుమార్ ఏకంగా ఎంపీ రెడ్డెప్ప సమక్షంలో రెచ్చిపోయారు. సెంథిల్ అలా వాగుతుంటే.. ఎంపీ రెడ్డెప్పతో సహా అక్క‌డున్న వారెవ‌రూ ఆయ‌న్ను క‌నీసం ఆపే ప్రయత్నం చేయకపోవడం విడ్డూరం. చంద్ర‌బాబుపై బాంబులేస్తాన‌ని బెదిరించ‌డ‌మే కాదు.. ఇంకా చాలా బూతులే మాట్లాడారు సెంథిల్‌కుమార్‌. 

చంద్ర‌బాబుపై వైసీపీ లీడ‌ర్ సెంథిల్‌కుమార్ చేసిన తీవ్ర వ్యాఖ్య‌లు ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఆ మాట‌ల వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. సెంథిల్‌కుమార్‌పై టీడీపీ శ్రేణులు భ‌గ్గు మంటున్నాయి. సెంథిల్ కుమార్ వ్యాఖ్య‌ల‌తో కుప్పంలో తీవ్ర‌ ఉద్రిక్తత త‌లెత్తింది. టీడీపీ అధినేతపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన వైసీపీ నేతపై ఫిర్యాదు చేసేందుకు టీడీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. వారికి పోటీగా వైసీపీ శ్రేణులూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. దీంతో ఇరువర్గాలు రోడ్డుపై బాహాబాహీకి దిగారు. తోపులాట తీవ్రస్థాయికి చేరడంతో భారీగా పోలీసుల మోహరించారు. టీడీపీ శ్రేణుల నుంచి పోలీసులు ఫిర్యాదు తీసుకొని.. ఇరువర్గాలకూ నచ్చజెప్పి పంపించేశారు పోలీసులు. 

బోసిడీకే అన్నందుకే ప‌ట్టాభిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.. టీడీపీ కార్యాల‌యాల‌పై దాడులు చేశారు.. మ‌రి, చంద్ర‌బాబు కారుపై బాంబులేస్తాన‌ని బెదిరించిన వైసీపీ నాయ‌కుడు సెంథిల్‌కుమార్‌పై పోలీసులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి.