మేమూ ఉప్పూకారం తింటున్నాం.. మాకు బీపీ వస్తే జగన్ తాట తీస్తాం..

చంద్ర‌బాబు చేప‌ట్టిన 36 గంట‌ల నిర‌వ‌ధిక దీక్షలో టీడీపీ నాయ‌కులు సీఎం జ‌గ‌న్‌రెడ్డిపై చెల‌రేగిపోతున్నారు. తూటాల్లాంటి మాట‌ల‌తో వైసీపీ ప్ర‌భుత్వాన్ని తూట్లు పొడుస్తున్నారు. ఒక్కో నేత ఒక్కో ర‌కంగా వార్నింగ్ ఇస్తున్నారు. అందరిలోకీ ప‌రిటాల సునీత చేసిన హెచ్చ‌రిక హైలైట్‌. టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక గంట క‌ళ్లు మూసుకుంటే చాలు.. తామేంటో చూపిస్తామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 

ఏపీలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. ఏపీని చంద్రబాబు రామరాజ్యంగా మారిస్తే, జగన్ రాక్షస రాజ్యంగా మార్చారని విమర్శించారు. తెలుగు తమ్ముళ్లకు బీపీ వస్తే జగన్ తాట తీస్తారని హెచ్చరించారు. వైసీపీ తాకాటు చప్పుళ్లకు భయపడమని.. 2024లో టీడీపీదే అధికారమని బుద్దా వెంకన్న అన్నారు. 

ఇక మ‌రో ఫైర్‌బ్రాండ్ లీడ‌ర్ చింత‌మ‌నేని సైతం ఓ రేంజ్‌లో జ‌గ‌న్‌రెడ్డిని, మంత్రుల‌ను దుయ్య‌బ‌ట్టారు. ‘‘మంత్రి పదవి కోసమే ఇన్నాళ్లూ కొడాలి నాని టీడీపీ నేతలను తిట్టారు. త్వరలోనే ఆయన పదవి పోవడం ఖాయం. జగన్‌కే కాదు.. గాడ్సేకు కూడా అభిమానులున్నారు. మేమూ ఉప్పూకారం తింటున్నాం.. మాకూ బీపీ వస్తుంది’’ అని చింతమనేని ప్రభాకర్ హెచ్చ‌రించారు. రాష్ట్రంలో ఎన్నికల జరగాల్సిన స్థానిక సంస్థలకు నోటిఫికేషన్‌ ఇస్తే వైసీపీకి ముచ్చెమటలు పట్టిస్తామన్నారు చింతమనేని. 

మ‌రోవైపు.. అమ్మను వదిలేసినవాడు అమ్మఒడి ఇస్తాడా? అని అమరావతి జేఏసీ అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ‘‘చెల్లిని వదిలేసిన వాడికి సెంటిమెంట్స్ ఉంటాయా? జగన్మోహన్ రెడ్డి తన సమాధిని తానే కట్టుకుంటున్నాడు. అరాచకంతో అధికారంలోకి వచ్చిన ఏ నాయకుడూ పూర్తికాలం అధికారంలో లేడు. ఈరోజు నుంచి సీఎం జగన్ గంజాయి ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తెచ్చినవారే సమాధి చేస్తారు. తాడేపల్లి నుంచి తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ బిడ్డల భవిష్యత్ కోసం ప్రజలంతా తిరగబడాలి. సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు జగన్ అరాచకాన్ని సృష్టించాడు’’ అని కొలికపూడి మండిప‌డ్డారు.